ఓ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ఏముండాలి? సాధారణంగా తెరపై పెద్ద పెద్ద పేర్లు మరింత ఎట్రాక్ట్ చేస్తాయి. ప్రమోషన్స్ సినిమాపై దృష్టి పడేలా చేస్తాయి. అయితే చిన్న సినిమాలకు అంత సీన్ ఎక్కడుంటుంది. అందులోనూ డైరక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యే సినిమాకు బలం ఏమిటి… కంటెంట్. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో కచ్చితంగా ‘పోతుగడ్డ’ చూడాలన్న కుతూహలం కలుగుతుంది. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే అభిమానించే వాళ్లకు. మరి ‘పోతుగడ్డ’ ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌ని మెప్పించిందా? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాయా?
స్టోరీ లైన్:
కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గం అసెంబ్లీ ఎలక్షన్స్ కు ప్రిపేర్ అవుతున్న టైమ్ అది. గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్న పోతుగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సముద్ర (ఆడుకాలం నరేన్) ఎలాగైనా మరోసారి సీట్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంటాడు. మరో ప్రక్క అతన్ని ఎలాగైనా ఓడించి ఎమ్మల్ేయ అవ్వాలని భాస్కర్ (శత్రు) నిర్ణయించుకుంటాడు. ఇద్దరూ పోటా పోటీగా ఉంటారు. భాస్కర్ డబ్బుని వెదజల్లి గెలవాలని, ఎన్నికల ముందు నుంచే కూడబెట్టడం మొదలుపెడతాడు.
అయితే, సముద్ర తక్కువవాడేం కాదు. మహిళలు, యూత్ ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని రంగంలోకి దింపాలనుకుంటాడు. ఆమెను పార్టీలో ‘జిల్లా యూత్ ప్రెసిడెంట్’ చేస్తాడు సముద్ర. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గీతకు రాజకీయాలు అంటే నచ్చవు. తాను ప్రేమించిన అబ్బాయితో కృష్ణ (ఫృథ్వీ దండమూడి) కలిసి పారిపోవాలని ప్లాన్ వేస్తుంది. ఆ క్రమంలో ఓ ప్లాన్ వేసుకుని ఒకరోజు గీత, కృష్ణ ఇద్దరు కలిసి బస్సులో పారిపోతారు.
ఆ విషయం సముద్రకు తెలిసి తన మనుష్యులను వాళ్లను పట్టుకోమని, అవసరమైతే చంపేయమని పురమాయిస్తాడు. మ రో ప్రక్క వాళ్లు ఎక్కిన అదే బస్సులో భాస్కర్ తను పంచాల్సిన యాభై కోట్ల డబ్బుని కూడా దాచిపెడతాడు. ఆ విషయం పోలిస్ లకు తెలుస్తుంది. అప్పుడు ఏమైంది. ఆ జంట ప్రేమ గెలిచిందా. ఆ డబ్బు విషయం బయిటకు వచ్చిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
‘పోతుగడ్డ’ ఇప్పటి వరకూ ఎవరూ రాయని, తెరకెక్కని కథైతే కాదు. ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కాకపోతే ఆ ఎమోషన్‌కంటూ ఓ బలం ఉంది. అందుకే… ఎన్నిసార్లు ఈ కథని చెప్పినా, మళ్లీ చెప్పాలనిపించి చెప్తూంటారు. దర్శకుడు కథని చాలా సింపుల్ గా మొదలెట్టాడు. ఓ లవ్ స్టోరీని, ఇద్దరు పొలిటీషన్స్ మధ్యన సెట్ చేసి ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఈ సీన్స్ నడుస్తున్న కొలిదీ మనకు చాలా పాత సినిమాల్ని గుర్తు వస్తూంటాయి. రెండు వర్గాలు, వాళ్ల వైరం, మధ్యలో లవ్ స్టోరీ.. ఇలా కథని చాలా ఆసక్తిగా నడిపాడు.
ఎక్కడా హీరోయిజం, బిల్డప్పులూ, ఓవర్ డ్రమటైజేషన్ లేవు అనుకుంటాం. అయితే అదే సమయంలో కథకు ఏం కావాలో అవి కూడా మిస్సయ్యాయి అని అర్దమవుతుంది. కథకు ఏ ఎమోషన్ , ఎంత కావాలో అంతే చెబుతూ చాలా షార్ప్‌గా కథనాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇలాంటి సినిమాలు నచ్చుతాయి. ఇందులో కాన్సెప్ట్, కథ, ప్రెజంటేషన్ దేనికవే అన్నట్టుగా కనిపిస్తాయి. సినిమా మొదలైన కాసేపటికే ఓ ఇంప్రెషన్ పడిపోతుంది. దాన్ని కంటిన్యూ చేయడంలోనే రచయితగా, దర్శకుడి పనితనంపై ఆధారపడి ఉంది. ఇక్కడ డైరక్టర్ కాస్త తడబడినట్టు అర్థమవుతుంది.
టెక్నికల్ గా చూస్తే …
టెక్నికల్ గా సినిమా బాగుంది. స్క్రిప్టే సమస్యగా మారింది. కాన్‌ఫ్లిక్ట్ విషయంలో కాస్త తడబడినా, క్లైమాక్స్ లో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేసాడు. సెకండాఫ్‌పై కాస్త దృష్టి పెడితే, కచ్చితంగా మరింత మంచి రిజల్ట్ వచ్చేది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలించి . ఫొటోగ్రఫీ, ఎడిటింగ్… ఇవన్నీ బాగా కుదిరాయి. హీరో,హీరోయిన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ బావున్నా లవ్ స్టోరీ ఇంప్రెసివ్ గా లేదు. మిగతా సీనియర్ నటులు అలా అలా చేసుకుంటూ వెళ్లిపోయారు.
చూడచ్చా
ఇంటెన్స్ తో క్రైమ్ థ్రిల్లర్ కాదు కానీ కాలక్షేపానికి ఓ లుక్కేయచ్చు
ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది
పోతుగడ్డ (Pothugadda) డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ఈటీవీ విన్లో తెలుగులో చూడచ్చు.