
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ రివ్యూ : హిట్టా? ఫట్టా?
డైరక్టర్ అవుదామనే కోమల్(విశ్వక్ సేన్) .. ‘మంచి ప్రొడక్షన్స్’ సంస్థ లో కథ ఓకే చేయించుకుంటాడు. ఆ సంస్ద అధినేత నిర్మాత సుదర్శన్ (సీనియర్ నరేష్)నాలుగు కోట్లు అని బడ్జెట్ పెట్టి సినిమా మొదలెడతాడు. అయితే ఆ బడ్జెట్ పట్టుతప్పి, సినిమా సగం కూడా అవకుండానే ఖర్చు నలభై కోట్లకు చేరుకుంటుంది. అది తట్టుకోలేని ఆ నిర్మాత హాస్పటిల్ పావుతాడు. దాంతో సినిమా ఆగిపోతుంది. అప్పుడు ఆయన కూతురు చిత్ర(కయాడు లోహర్) సీన్ లోకి వస్తుంది.
వచ్చీ రావటంతోనే కోమల్ తో గొడవపడుతుంది. అయితే కోమల్ మహా ముదురు. దాంతో అలా చెప్పి, ఇలా చెప్పి, మొత్తానికి ఆ బ్యాలన్స్ షూటింగ్ ని కోటి రూపాయల్లోనే కంప్లీట్ చేస్తానని చెప్పి ఒప్పిస్తాడు. అందుకు తగ్గ స్కెచ్ వేస్తూంటాడు. అయితే ఊహించని విధంగా జీకే(సంపత్ రాజ్) వస్తాడు. అతను ఆ సినిమాని ఆపాలని చూస్తాడు. అతను ఎవరు..అతనికి కోమల్ కు మధ్య ఏం జరిగింది. అలాగే కోమల్ కు, చిత్ర మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది. చివరకు కోమల్ సినిమాని కంప్లీట్ చేశాడా? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఒక కామెడీ సినిమా సక్సెస్ అవ్వాలంటే కేవలం జోకులు మాత్రమే సరిపోవు, దానికి బలమైన కథాకల్పన కూడా అవసరమని ఈ సినిమా నిరూపించింది. ప్రపంచ ప్రఖ్యాత స్క్రీన్ ప్లే గురువు సిడ్ ఫీల్డ్ (Syd Field) అన్నట్లు, “మంచి స్క్రీన్ ప్లే అంటే కేవలం డైలాగుల సంకలనం కాదు, అది పాత్రల ప్రయాణం”. ‘ఫంకీ’ విషయంలో జరిగిన ప్రధాన లోపం ఇదే.
అలాగే “సినిమాలో డ్రామా ఎంత బలంగా ఉంటే, ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అవుతాడు”. కానీ ఈ సినిమాలో కథ ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది, కథలో చలనం లేదు. కామెడీ పండటానికి ‘కాన్ఫ్లిక్ట్’ అనేది ఒక ఇంజిన్ లాంటిది. ప్రధాన పాత్రలు సినిమా అంతటా నిరంతరం అడ్డంకులను మరియు సవాళ్లను ఎదుర్కోవాలి, అవి సినిమా సాగేకొద్దీ పెరుగుతూ ఉండాలి. సమస్య ఎంత పెద్దదైతే, దాని నుండి పుట్టే హాస్యం అంత ఎక్కువగా ఉంటుంది. అదే ఈ సినిమాలో లోపించింది. ఒకే పాయింట్ సినిమా మొదలనుంచి చవరిదాకా పెరగకుండా,తగ్గకుండా స్దిరంగా ఉండిపోతుంటే మజా ఏముంటుంది. డైలాగులు సైతం అదే సిట్యువేషన్ చుట్టూ తిరుగుతూంటాయి.
అలాగే డైలాగులు విషయానికి వస్తే బలవంతంగా చొప్పించిన జోకులు లేదా మరీ స్క్రిప్ట్ రాసినట్లుగా అనిపించే లైన్లు ఉండకూడదు. ఈ సినిమాలో వన్ లైనర్స్ బాగున్నా..కథతో,సీన్ తో సంభంధంలేకుండా వచ్చి పోతూంటాయి.. ఇక విలన్ (సంపత్ రాజ్) ట్రాక్ కథకు ఏమాత్రం ఊపునివ్వకపోగా, “ఎందుకు పెట్టారా?” అనే సందేహాన్ని కలిగిస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ …
విశ్వక్ సేన్ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. ఇక కయదు లోహర్: తన అందంతో ఆకట్టుకుంది, నటన కూడా పర్వాలేదనిపించింది. సీనియర్ నటులు నరేష్ తన కామెడీతో నవ్వించగా, ఈశ్వరి రావు తల్లి పాత్రలో మంచి ఎమోషన్ పండించారు. గెస్ట్ అప్పీరెన్స్ గా డైరెక్టర్లు అనుదీప్, హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ తళుక్కున మెరిసి నవ్వించే ప్రయత్నం చేశారు. వీళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేయగా, సంపత్ రాజ్ పాత్ర మాత్రం కాస్త విసుగు తెప్పిస్తుంది.
టెక్నికల్ గా …
సంగీతం & కెమెరా: భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు, పాటలు కూడా క్లిక్ అవ్వలేదు. అయితే సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రతి ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
ఎడిటింగ్ & ప్రొడక్షన్: నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, సీన్లే చాలా రాండమ్‌గా ఉండటం వల్ల ఎడిటర్‌ను కూడా తప్పుబట్టలేం.
దర్శకత్వం: అనుదీప్ కె.వి కేవలం వన్-లైనర్స్ మీద పెట్టిన దృష్టిని, ప్రాపర్ కామెడీ బ్లాక్స్ డిజైన్ చేయడం మీద పెట్టి ఉంటే బాగుండేది. కేవలం డైలాగులనే నమ్ముకోవడం పెద్దగా వర్కవుట్ కాలేదు.
చూడచ్చా?
కాసేపు అక్కడక్కడా వచ్చే వన్ లైనర్స్ ని ఎంజాయ్ చేయచ్చు. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే కష్టం అనిపించవచ్చు.
