అటు పొలిటికల్ హీట్.. ఇటు దళపతి విజయ్ క్రేజ్! కానీ ఈ రెండింటి మధ్య ‘జన నాయగన్’ బాక్సాఫీస్ దగ్గర చిక్కుకుపోయింది. సినిమా రిలీజ్ కావాలా వద్దా అనేది ఇప్పుడు సెన్సార్ బోర్డు కాదు.. సాక్షాత్తూ ఎలక్షన్ కమిషన్ తేల్చబోతోంది. అసలు విజయ్ సినిమాకు ఎలక్షన్లకు సంబంధం ఏంటి? ఆ క్లిష్టమైన మ్యాటర్ ఏంటో తెలుసా?
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చుట్టూ ఉన్న ఉత్కంఠ ఇప్పుడు పీక్స్‌కు చేరింది. మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడం మేకర్స్‌ను కలవరపెడుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై వడ్డీలు కొండలా పెరిగిపోతున్నాయి. ఒకవైపు రివైజింగ్ కమిటీ సినిమా చూసిందని కొందరు, లేదని మరికొందరు చెబుతుండగా.. ఇప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ‘ఎన్నికల కోడ్’ అమల్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చన పట్నాయక్ ఈ సినిమా విషయంలో కీలక క్లారిటీ ఇచ్చారు. సెన్సార్ క్లియరెన్స్ పై ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (ECI) తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సినిమాలో రాజకీయ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ అడ్డంకులన్నీ తొలగి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మేకర్స్ మే 8న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తోంది.

సినిమా రిలీజ్ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండటంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. దళపతి మార్క్ పొలిటికల్ డ్రామా థియేటర్లకు వస్తుందా లేక ఎన్నికల తర్వాతేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!

