38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం – కమల్ హాసన్ కలయిక మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది సాధారణమైన సంఘటన కాదు. ఇది ఒక లెజెండరీ ఛాప్టర్‌కు కొనసాగింపు. మరి “Thug Life” అందుకు తగ్గట్లే ఉందా?
స్టోరీ లైన్
రంగరాయ శక్తిరాజ్ (కమల్ హాసన్) — ఢిల్లీ అండర్‌వరల్డ్‌లో పెద్ద పేరు. పక్కా ప్రిన్సిపల్స్‌తో, కరుణతో కూడిన గ్యాంగస్టర్ గా అతనికో ప్రత్యేక గుర్తింపు. అతనితో సహచరులు మాణిక్యం (నాజర్), పత్రోస్ (జోజు జార్జ్), అన్బు రాజ్ (భగవతి పెరుమాళ్). ఇక ఈ ముఠాకు ప్రధాన శత్రువు – సదానంద్ (మహేశ్ మంజ్రేకర్). ఓసారి శక్తిరాజ్ గ్యాంగ్ కు పోలీస్ లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సామాన్యుడు మృతి చెందుతాడు. అతని పదేళ్ల కొడుకు అమర్, చెల్లి చంద్ర– ఆ గొడవలో వేరవుతారు. వెంటనే శక్తిరాజ్ .. అమర్‌ను దగ్గరకు తీస్తాడు. “నీ చెల్లెల్ని వెతికి తీసుకురావడం నా బాధ్యత” అని మాటిస్తాడు.
అతని భార్య లక్ష్మి (అభిరామి), కుమార్తె మంగా (సంజనా) — అమర్‌ను తమ ప్రేమగా చూసుకుంటారు. మరో ప్రక్క వేశ్యా గృహం నుండి విముక్తి పొందిన ఇంద్రాణి (త్రిష) — శక్తిరాజ్ ని భక్తిగా చూస్తుంటుంది. సంవత్సరాలు గడుస్తాయి… అమర్… శక్తిరాజ్‌కు ఒక నీడగా, తరువాతికి వారసుడిగా ఎదుగుతాడు. అయితే ఓ సారి శక్తిరాజ్ జైలుకు వెళతాడు. అతని అధికారం, అతని వారసత్వం – అమర్ చేతిలో పెట్టాల్సి వస్తుంది. ఇది గ్యాంగ్ లో అందరికి రగిలిపోయేలే చేస్తుంది. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నవారు – ఇప్పుడు లోపల కలతలతో ఎగిసిపడతారు.
ఇదే సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు సదానంద్. అమర్‌ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాడు. మిగతా గ్యాంగ్ సభ్యులు – అమర్ మీద బలంగా ఉండే విశ్వాసాన్ని చీల్చాలనుకుంటారు. ఈ మైండ్ గేమ్ లో ఎవరు గెలుస్తారు? శక్తిరాజ్ తిరిగి వస్తే ఏమౌతుంది?ఇంతకీ చిన్నప్పుడే విడిపోయిన చంద్ర ఎక్కడ ఉంది? ఇంద్రాణి ప్రేమలో నిజమెంత? అమర్ వెళ్ళేది దారి – నిజంగా శక్తిరాజ్ ఆశించినదేనా?ఇవన్నీ తెలియాలంటే ‘Thug Life’ చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఇది ఓ అతి సాధారణమైన గ్యాంగ్‌స్టర్ గొడవల నేపథ్యంలో నడిచే ప్రతీకార కథ. శక్తి (కమల్ హాసన్) అనే గ్యాంగ్ లీడర్ తనకు ద్రోహం చేసినవారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానాంశం. ఇప్పటికే ఈ కథ ఎన్నోసార్లు చూసాం. మరి మణిరత్నం ఈ పాత కథకు కొత్త మెరుగు ఇవ్వగలరా? అంటే… కష్టమే అని తేలిపోయింది.
ఫ్లాష్‌బ్యాక్‌లతో మొదలయ్యే ఫస్ట్ హాఫ్‌లో, శక్తి–అమర్, శక్తి–నాజర్, శక్తి–త్రిష మధ్య ఉన్న రిలేషన్స్ ద్వారా ఎమోషన్స్ రైజ్ చేసి ఉండాల్సింది. కానీ ఈ బంధాలు కేవలం కథ కోసం ఏర్పడినట్లు ఉండటం వల్ల, ప్రేక్షకుడిని తాకే మానవీయ కోణం ఏర్పడదు. ఉదాహరణకి, తండ్రీ–కొడుకుల్లా పెరిగిన శక్తి, అమర్‌ల మధ్య టెన్షన్ ఓ స్దాయిలో ఉండాల్సింది. కానీ అది చాలా కృత్రిమంగా ఉంటుంది. అలాగే శక్తి – త్రిష ట్రాక్ అయితే ఉన్నట్టుండి వచ్చి, ఎమోషనల్ కనెక్షన్ లేకుండానే మాయమవుతుంది. దాంతో ఫస్ట్ హాఫ్ ఒక నిరుత్సాహకరమైన ప్రయాణంలా అనిపిస్తుంది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి విజువల్ హైతో ముగుస్తుంది. కానీ అక్కడినుంచి కథ ముందుకు పోవడం మొదలయ్యాక, అసలు ఆసక్తి మసకబారిపోతుంది. శక్తి మళ్ళీ వచ్చి, తన ప్రతీకారం మొదలుపెట్టాలి – ఇదే కథాంశం. కానీ ఆ రీ-ఎంట్రీలో ఎమోషన్,టెన్షన్, ఇంటర్నల్ కాంప్లిక్ట్ లేదు, ఇంటెన్స్ అసలే లేదు. గ్యాంగ్‌స్టర్స్ భయపడాలి, వాతావరణం ఉత్కంఠతరంగా ఉండాలి. కానీ ఇవేమీ మనకు అనిపించవు. అన్ని రొటీన్ గానే ఉంటాయి. ఇక చివర్లో శింబు ఎంట్రీ – కథలో కీలకం కావాలి. కానీ ఇది కూడా climaxలో పూర్తిగా వృథా అవుతుంది.
టెక్నికల్ గా …
సినిమాటోగ్రఫీ: కొన్ని విజువల్స్ నిజంగా బాగున్నాయి. ప్రత్యేకించి శక్తి రీటర్న్ ఎపిసోడ్స్‌లోని గ్రేడింగ్, లైట్ షేడ్స్ అద్భుతం. కానీ అదే విజువల్ స్టైల్‌కి మిగతా ఎమోషన్లు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇది కేవలం డిజైన్ లుక్‌గా మిగిలిపోతుంది.
సంగీతం: ఏఆర్ రెహ్మాన్ సాధారణంగా ఎమోషన్‌లకు మ్యూజికల్ ప్లస్ గా నిలుస్తాడు. కానీ ఈసారి ఆయన సంగీతం కథను నడిపించలేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ కూడా ఊహించినంత ఇంపాక్ట్ కలిగించలేదు.
ఎడిటింగ్: పేసింగ్ చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా మొదటి సగం తెగ బోరుగా అనిపిస్తుంది. ట్రాన్సిషన్‌లు కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నాయి.
ఫైనల్ గా :
Thug Life — ఒక ఎమోషన్‌లేని ప్రతీకార కథ, అద్భుతమైన నటీనటులు ఉన్నా ఫలితం లేదు. కమల్ హాసన్ ఓ స్థాయిలో ఆకట్టుకుంటారు కానీ చివరికి ఆయన పాత్రకే పూర్తి స్థాయిలో న్యాయం జరగదు. శింబు వంటి నటుడిని climaxలోనే వృథా చేయడం – ఇది స్క్రీన్‌ప్లే ఫెయిల్యూర్ కి నిదర్శనం.