అవీ ఇవీసినిమా వార్తలు

అమితాబ్ బచ్చన్ మెచ్చిన ఆఫీసర్.. కటకటాల పాలైంది! కోట్లలో వరద నిధుల గోల్‌మాల్!

ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) వేదికపై తన తెలివితేటలతో దేశాన్నే మెప్పించిన ఆ మహిళా ఆఫీసర్, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. నాడు బిగ్ బి ప్రశంసలు అందుకున్న ఆమె, నేడు ప్రజా ధనాన్ని కోట్లలో స్వాహా చేసి జైలు ఊచలు లెక్కపెడుతోంది. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ భారీ అవినీతి కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక బాధ్యతాయుతమైన తహశీల్దార్ హోదాలో ఉండి, వరద బాధితులను ఆదుకోవాల్సిన నిధులను తన జేబులో వేసుకున్న ఆ కిలేడీ ఆఫీసర్ భాగోతం ఇప్పుడు బయటపడింది.

వరద నిధుల్లో రూ. 2.5 కోట్ల దోపిడీ!

2021లో మధ్యప్రదేశ్‌లో వచ్చిన వరదలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేశాయి. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం పంపిన సహాయక నిధులపై అమితా సింగ్ తోమర్ కన్ను పడింది. అసలైన బాధితులకు అందాల్సిన రూ. 2.5 కోట్ల నిధులను తప్పుడు బ్యాంక్ ఖాతాలకు మళ్లించి భారీ స్కామ్‌కు తెరలేపింది. ఈ కుంభకోణంలో ఆమె ఒక్కతే కాదు, మరో 22 మంది రెవెన్యూ అధికారులు కూడా అడ్డంగా దొరికిపోయారు. మొత్తం 110 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

కోర్టులు మొండి చేయి.. కలెక్టర్ వేటు!

అమితా సింగ్ తోమర్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం తిరిగినా, ఏ న్యాయస్థానం ఆమెకు ఊరటనివ్వలేదు. దీంతో గత కొంతకాలంగా విధులకు ఎగనామం పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పరిస్థితిని గమనించిన కలెక్టర్ అర్పిత్ వర్మ ఆమెను వెంటనే విధుల్లో నుంచి తొలగించారు. చివరకు గ్వాలియర్‌లోని ఆమె నివాసంపై దాడి చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని శివపురి జైలుకు తరలించారు.

KBC స్టార్.. ఇప్పుడు జైలు పక్షి!

అమితా సింగ్ తోమర్ అంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉండేది. KBCలో పాల్గొని తన నాలెడ్జ్‌తో ఏకంగా రూ. 50 లక్షలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక మహిళా అధికారిణిగా ఆమె చూపిన ప్రతిభకు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఫిదా అయ్యారు. కానీ, అప్పట్లో మేధావిగా కనిపించిన ఈ ఆఫీసర్, ఇంతటి అవినీతి అనకొండ అని తెలిసి ఇప్పుడు జనం విస్తుపోతున్నారు. తెలివితేటలను ప్రజల కోసం వాడాల్సింది పోయి, ఇలా జేబులు నింపుకోవడానికి వాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ కిలేడీ తహశీల్దార్ అరెస్ట్ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో కాకరేపుతోంది. వరద బాధితుల ఉసురు తగిలిందని, అందుకే ఇలా అడ్డంగా దొరికిపోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Similar Posts