బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్, యంగ్ హీరో విజయ్ కార్తీక్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకుని, అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విజయ్ కార్తీక్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఆమె నిర్ణయమే.. నా తప్పేమీ లేదు!
సాధారణంగా బ్రేకప్ అంటే అబ్బాయిదే తప్పు అని చాలామంది అనుకుంటారు. కానీ విజయ్ మాత్రం అసలు నిజాన్ని బయటపెట్టాడు. “నేను కీర్తిని వదిలేయలేదు.. ఆమెనే నన్ను వదిలేసింది. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంత బ్రతిమాలినా ఆమె వినలేదు. విడిపోవాలనే నిర్ణయం పూర్తిగా కీర్తిదే” అని విజయ్ క్లారిటీ ఇచ్చాడు.
డబ్బు కోసమే ఈ బ్రేకప్?
బ్రేకప్‌కు గల అసలు కారణాన్ని చెప్తూ విజయ్ బాంబ్ పేల్చాడు. తాను ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదని, డబ్బులు సరిగ్గా లేవన్న కారణంతోనే కీర్తి తనను దూరం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, కీర్తికి అప్పుడే మరో ‘బెటర్ ఆప్షన్’ దొరికిందని, ఒక వ్యక్తితో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని తనకు స్వయంగా చెప్పిందని విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.
ఫోటోలు ఎందుకు డిలీట్ చేయలేదంటే?
“కీర్తి అప్పుడే నా ఫోటోలన్నీ తీసేసింది.. కానీ నేను మాత్రం తీయలేదు. ఒక పోస్ట్ డిలీట్ చేయడం ఈజీనే కానీ, ఆ జ్ఞాపకాలను చెరిపేయడం కష్టం. నా బాధ తగ్గిన తర్వాతే ఆ ఫోటోలను తీసేస్తా” అంటూ విజయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇకనైనా ఈ విషయాన్ని రాద్ధాంతం చేయవద్దని, డబ్బు కోసం పీఆర్ టీమ్‌లు తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు.
ప్రస్తుతం విజయ్ కార్తీక్ చేసిన ఈ కామెంట్స్ పై కీర్తి భట్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

