సినిమా వార్తలు

ఒకే వాయిద్యం.. 9 వేల భావాలు! ఇళయరాజా సృష్టించిన ఈ ‘మ్యూజికల్ మ్యాజిక్’ గురించి మీకు తెలుసా?

సంగీత ప్రపంచంలో ఆయన ఒక ‘ఇసైజ్ఞాని’. వందల వాయిద్యాలతో సింఫొనీలు సృష్టించడం ఒక ఎత్తు అయితే, కేవలం ఒకే ఒక వాయిద్యంతో కోట్లాది హృదయాలను కదిలించడం ఇళయరాజా (Ilaiyaraaja) గారికే సాధ్యం. సంగీతంలో ‘మినిమలిజం’ (Minimalism) అనే కష్టమైన కళను ఆయన ఎలా అవపోసన పట్టారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఏమి వాయించాలో కాదు.. ఏమి వదిలేయాలో తెలియడమే సంగీతం!

చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు పాట నిండా వాయిద్యాలను దట్టించి శబ్దాలతో నింపేస్తారు. కానీ ఇళయరాజా సిద్ధాంతం వేరు. తక్కువ వాయిద్యాలను ఉపయోగించి పూర్తి భావాలను పలికించడమే ఆయన స్పెషాలిటీ. ఆయన దృష్టిలో సంగీతం అంటే శబ్దం మాత్రమే కాదు, నిశ్శబ్దం కూడా!

ఒక్క తబలాతోనే గుండె భారమైపోయేలా..

1985లో వచ్చిన ‘ముదల్ మరియాదై’ చిత్రంలోని “రాసావే ఉన్నై నంబి…” పాట దీనికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ పాటలో రాజా గారు కేవలం తబలాను మాత్రమే వాడారు. ఎస్. జానకి గారి గాత్రానికి ఆ తబలా ఇచ్చే లయ, ఒక మహిళలోని ఒంటరితనాన్ని, ఆవేదనను హృదయ స్పందనలా వినిపిస్తుంది. ఒక్క తబలాతోనే ఇంతటి లోతైన ఎమోషన్‌ను పండించడం ఆయనకే చెల్లింది.

నేల సవ్వడి.. దేశీ వాయిద్యాల సందడి!

‘ఉన్నాల్ ముడియుం తంబి’లోని “పుంజై ఉండు నంజై ఉండు…” పాటలో ఆయన ఘటం, తవిల్ వంటి స్వచ్ఛమైన దేశీ వాయిద్యాలనే వాడారు. దీనివల్ల ఆ పాటకు మట్టి వాసనతో కూడిన సహజమైన గ్రామీణ అనుభూతి లభించింది. ఏ భారీ ఆర్కెస్ట్రా ఇవ్వలేని ఫీల్‌ను ఆ చిన్న వాయిద్యాలు ఇచ్చాయి.

బీజీఎంలోనూ అదే మ్యాజిక్!

కేవలం పాటలే కాదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) లోనూ ఆయన ఈ టెక్నిక్ వాడతారు.

మౌన రాగం: ఇందులో వేణువుతో ఒక అమ్మాయి మనసులోని సంఘర్షణను పలికించారు.

నందలాలా: కేవలం పియానోతోనే సన్నివేశంలోని పూర్తి భారత్వాన్ని ప్రేక్షకులకు అనుభవంలోకి తెచ్చారు.

ఏదైమైనా ఇళయరాజా గారి సంగీతం కేవలం సాంకేతికం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఒక శిల్పి అనవసరమైన రాయిని తీసేసి అందమైన శిల్పాన్ని చెక్కినట్లు, ఆయన అనవసర శబ్దాలను తీసేసి స్వచ్ఛమైన రాగాన్ని మనకు అందిస్తారు. అందుకే ఆయన ‘మినిమలిస్టిక్ మ్యూజిక్’ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

మీరేమంటారు? ఇళయరాజా గారి పాటల్లో మీకు నచ్చిన ‘సింపుల్ అండ్ స్వీట్’ సాంగ్ ఏది? కింద కామెంట్ చేయండి!

Similar Posts