
బ్రాహ్మణ సంఘాలు మండిపాటు, మనోజ్ బాజ్‌పాయ్ కొత్త సినిమాపై కోర్టు సీరియస్!
ఇండియన్ స్క్రీన్‌పై తన యాక్టింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసే మనోజ్ బాజ్‌పాయ్, ఈసారి వెండితెరపై కాకుండా కోర్టు బోనులోకి ఎక్కి వార్తల్లో నిలిచారు! ఆయన లేటెస్ట్ మూవీ ‘Ghooskhor Pandat’ (గూస్కోర్ పండిత్) టైటిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తోంది. కేవలం టైటిల్ అని లైట్ తీసుకుందాం అనుకుంటే, సీన్ రివర్స్ అయి ఏకంగా జబల్పూర్ కోర్టు ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ మరియు డైరెక్టర్ నీరజ్ పాండేలకు కోర్టు జారీ చేసిన నోటీసులు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి!
అసలేం జరిగింది?
నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పాయ్ ఒక అవినీతి అధికారిగా నటిస్తున్నారు. అయితే, టైటిల్లో ‘పండత్’ అనే పదాన్ని ‘గూస్కోర్’ (లంచగొండి) అనే పదంతో కలపడంపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ టైటిల్ ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, పవిత్రమైన పేరును అప్రతిష్టపాలు చేస్తోందని జబల్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
కోర్టు క్లాస్.. దిగొచ్చిన మేకర్స్!
జబల్పూర్ జేఎంఎఫ్‌సీ (JMFC) కోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కోర్టు గట్టిగా హెచ్చరించింది. అప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలతో పరిస్థితి చేజారిపోతుండటంతో, డైరెక్టర్ నీరజ్ పాండే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వివాదాస్పదమైన ఆ టైటిల్‌ను, దానికి సంబంధించిన అన్ని ప్రమోషన్లను తక్షణమే తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
నటుడు మనోజ్ బాజ్పేయీ ‘గూస్కోర్ పండిట్’ (Ghooskhor Pandat) టైటిల్లోని ‘పండిట్’ పదంపై నెలకొన్న వివాదంపై స్పందించారు. ఈ టైటిల్ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్లందరి భావాలను గౌరవిస్తానని తెలిపారు. సినిమాలో అది కేవలం కల్పిత పాత్రే అని, ఎవరిని ఉద్దేశించింది కాదని అన్నారు. ఈ మేరకు మనోజ్ బాజ్పేయీ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
‘ప్రేక్షకుల భావోద్వేగాలను, ఆందోళనలను నేను గౌరవిస్తాను. మన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, ఒక్క క్షణం ఆగి వాళ్ల మాట వినాల్సి ఉంటుంది. నటుడిగా నేను ఒక కథను, అందులోని పాత్రను మాత్రమే చూస్తాను. ఇందులో పోషించిన పాత్ర కూడా ఒక వ్యక్తిలోని లోపాలు, అతని ఆత్మపరిశీలన ప్రయాణాన్ని గురించి చూపించేదే. అది ఎవరినీ ఉద్దేశించింది కాదు. ఏ వర్గానికి, కులానికి వ్యతిరేకంగా చేసింది కాదు. డైరెక్టర్ నీరజ్ పాండే ఎంతో బాధ్యతతో సినిమాలు తెరకెక్కిస్తారు. అయినప్పటికీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ తొలగించారు. దీన్ని బట్టే ఈ సమస్యను మేం ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు’ అని బాజ్పేయీ తెలిపారు.
సినిమాలో ఏముంది?
రితేష్ షా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ ‘అజయ్ దీక్షిత్’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. చుట్టూ ఉన్న కుట్రలు, ప్రపంచవ్యాప్త మాఫియా నెట్వర్క్ మధ్య ఈ అవినీతి అధికారి ఎలా చిక్కుకున్నాడు అనేదే కథ. నుష్రత్ భరుచా, సాకిబ్ సలీమ్ వంటి టాప్ కాస్ట్ ఉన్నప్పటికీ, టైటిల్ వివాదం ఈ ప్రాజెక్ట్‌ను ప్రమాదంలో పడేసింది.
ప్రస్తుతానికి టైటిల్ మార్చడానికి మేకర్స్ ఒప్పుకున్నా, ఈ కేసు ఇంకా ముగియలేదు. ఫిబ్రవరి 19న జరిగిన విచారణలో టైటిల్ మార్పుపై క్లారిటీ వచ్చినా, అప్పటికే జరిగిన డ్యామేజ్‌పై కోర్టు నోటీసులు పంపింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు కొత్తగా ఏ పేరు పెడతారు? అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ గొడవ ఎటు దారితీస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే!
