సినిమా సమీక్షలు

తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీ రివ్యూ

రాజమండ్రిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రశాంతి (అందరూ ప్రేమగా పిలిచే శాంతి – ఈషా రెబ్బ) కి ఫ్రీ సీటు వచ్చినా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యిపోతారు. ఆ వేట మొదలెట్టినా వెంటనే ఒక సంబంధం ఖరారవుతుంది. ‘చేపల చెరువు’ యజమాని అయిన ఓంకార నాయుడు (తరుణ్ భాస్కర్) ప్రశాంతిని ఇష్టపడి, కట్నం అడగకుండానే వివాహం చేసుకుంటాడు.అంతేకాదు ఆమె చదువు కొనసాగించడానికి కూడా అతను అంగీకరించడంతో శాంతికి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

కానీ, అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత ప్రశాంతికి తన భర్త వింతైన, మొండి మనస్తత్వం అర్థమవుతుంది. ఓంకర్ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేస్తాడు, అదే సమయానికి అల్పాహారం సిద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. పైగా తన తల్లి మరియు సోదరి ఖచ్చితంగా ఇడ్లీలే చేయాలని పట్టుబడతాడు. ఇడ్లీ తప్ప వేరే ఏది అతనికి టిఫిన్ కింద పనికిరాదు. ఒకరోజు ప్రశాంతి ధైర్యం చేసి వేరే అల్పాహారం సిద్ధం చేయడంతో అతను ఆమెను చెంపదెబ్బ కొడతాడు. ఇది మెల్లగా అతనికి అలవాటుగా మారుతుంది. ఒకరోజు ఇక భరించలేక ఆమె తిరిగి దాడి చేసి అతన్ని కొడుతుంది.

ప్రశాంతి యూట్యూబ్ (YouTube) వీడియోలు చూసి రహస్యంగా కరాటే నేర్చుకుందని ఓంకర్ తెలుసుకుంటాడు. ఈ విషయం తన అహాన్ని దెబ్బతీయడంతో, అతను కూడా కరాటే నేర్చుకుని ఆమెను ఎదుర్కోవడమే కాకుండా, వారిద్దరి మధ్య జరిగే గొడవను రికార్డ్ కూడా చేస్తాడు. అయినప్పటికీ, ప్రశాంతి అతన్ని చిత్తుగా ఓడిస్తుంది. కానీ అతనిలోని పురుషాహంకారం ఓటమిని అంగీకరించదు, దానితో వేధింపులు కొనసాగుతూనే ఉంటాయి.

తన మామయ్య (బ్రహ్మాజీ) సలహా మేరకు ఓంకర్ ఆమెతో రాజీ పడినట్లు నటిస్తాడు. ప్రశాంతికి క్షమాపణలు చెప్పి, ఆమెను తాను నిజంగా ప్రేమిస్తున్నానని నమ్మిస్తాడు. కొద్దిరోజులకే ఆమె గర్భవతి అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఓంకర్ వేసిన అసలు ప్లాన్ ప్రశాంతికి తెలుస్తుంది, దీనితో ఆమె అతని ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా కథ.

విశ్లేషణ

ఈ సినిమా మళయాళం రీమేక్ . అక్కడ అంత పెద్ద హిట్ అవ్వటానికి గల కారణం..చిత్రం కేవలం గృహ హింసకు వ్యతిరేకంగా గొంతు వినిపించడమే కాకుండా, ఒక సాధారణ మహిళ తన అంతర్గత శక్తిని ఎలా కనుగొంది అనే ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయటమే.

మళయాళం నుంచి తెలుగుకు వచ్చేసరికి కామెడీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో సీరియెస్ నెస్ తగ్గింది. మరీ ముఖ్యంగా ఓంకార నాయుడు పాత్ర సెట్ కాలేదు. ఓంకార్‌ను ఒక సాధారణ, పితృస్వామ్య భావజాలం ఉన్న వ్యక్తిగా చూపించినంత సేపు కథనం నమ్మశక్యంగా ఉంది. కానీ, అతను తన భార్యపై కరాటే యుద్ధంలో గెలిచి, దాన్ని రికార్డ్ చేసి తన మామయ్యకు పంపాలని ప్లాన్ చేసే ఎపిసోడ్ పాత్రలోని సహజత్వాన్ని దెబ్బ కొట్టింది.

ఒక సాధారణ మధ్యతరగతి మనిషిలో ఉండే ‘స్త్రీ ద్వేషాన్ని’ (Misogyny) చూపిస్తూనే, హఠాత్తుగా అతన్ని ఒక విలన్ లాగా లేదా వింతగా ప్రవర్తించే వ్యక్తిగా మార్చడం వల్ల పాత్ర యొక్క ఇంటెన్సిటీ తగ్గింది. ఇది మలయాళ మాతృకలో ఉన్నా, తెలుగు వెర్షన్‌లో ఆ పాత్ర కి కొద్ది పాటి మార్పులు చేయటం వల్ల ఆ స్వభావానికి అతకలేదు.

అయితే ఈ సినిమాలో ప్లస్ ల్లో గోదావరి నేపథ్యం, మధ్యతరగతి జీవనశైలి సినిమాకు నేటివిటీని తీసుకొచ్చాయి. అయితే, ఫన్ విషయంలో స్క్రిప్ట్ తడబడింది. ముఖ్యంగా హీరో వద్ద పనిచేసే పనివారు , వారి మధ్య జరిగే డైలాగులు తెరపై అసలు పండలేదు. అవి కథనానికి ఎలాంటి అదనపు బలాన్ని ఇవ్వకపోగా, సాగతీతగా అనిపించాయి.

అయితే శాంతి ఒక మూస పద్ధతిలో ఉండే భార్యలా కాకుండా, తన జీవితానికి తానే బాధ్యురాలిగా మారే సన్నివేశాలే ఈ సినిమాకు ఉన్నంతలో ఎమోషనల్ వెయిట్‌ను ఇచ్చాయి.

టెక్నికల్ గా చూస్తే..

ఒక గ్రామీణ మధ్యతరగతి మహిళగా ఈషా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకు ప్రాణం పోసింది. తరుణ్ భాస్కర్ , బ్రహ్మాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకత్వం విషయానికి వస్తే…ఓ డెబ్యూ డైరెక్టర్ ఏఆర్ సజీవ్ కొన్ని ఎపిసోడ్లలో మెరుపులు చూపించినా, స్క్రీన్‌ప్లేను మరింత బిగుతుగా రాసుకుని ఉంటే సినిమా ఇంపాక్ట్ మరోలా ఉండేది.

చూడచ్చా

ఒరిజనల్ సినిమా చూడని వాళ్లకు ఇది బాగానే అనిపిస్తుంది. ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకపోతే నచ్చుతుంది.

ఫైనల్ గా..

సినిమాలో మూల ఉద్దేశం నిజాయితీగా ఉన్నా, కథనంలో ఉండాల్సిన ‘పంచ్’ లోపించింది. గృహ హింసకు వ్యతిరేకంగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన సినిమా అయితే దీన్ని చెప్పుకోవచ్చు.

Similar Posts