
భానుప్రియ సినిమాలు మానేయడం వెనుక ఉన్న ఆ ‘వింత సమస్య’, తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
80, 90వ దశకంలో టాలీవుడ్‌ను తన కళ్లతోనే శాసించిన నటి భానుప్రియ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ స్టార్స్ సరసన నటించి.. అందం, అభినయం, అంతకుమించి అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన ‘స్వర్ణకమలం’ ఆమె. కానీ, గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ సీనియర్ నటి.. తాను సినిమాలకు ఎందుకు నో చెబుతున్నానో వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జీవితాన్ని తలక్రిందులు చేసిన ఆ ఒక్క ఘటన!
భానుప్రియ సినిమాలకు దూరం కావడానికి కారణం ఆఫర్లు లేక కాదు.. ఆమె ఎదుర్కొంటున్న ఒక వింత సమస్య. అదే జ్ఞాపకశక్తి కోల్పోవడం (Memory Loss). తెలుగు వన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భానుప్రియ తన బాధను పంచుకున్నారు. 2018లో తన భర్త ఆదర్శ్ కౌశల్ హార్ట్ ఎటాక్‌తో అకస్మాత్తుగా మరణించడంతో ఆమె మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నదట. ఆ బాధ నుంచి కోలుకోలేక వ్యక్తిగతంగా కుంగిపోయిన భానుప్రియకు.. క్రమంగా మతిమరుపు మొదలైంది.
షూటింగ్ సెట్‌లోనే డైలాగ్స్ మర్చిపోయి..
“సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నా.. ఇప్పుడు నా మెదడు సహకరించడం లేదు. ఒక సినిమా షూటింగ్ సెట్‌లో డైలాగులు కూడా గుర్తుకు రాక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ పరిస్థితి నన్ను చాలా భయపెట్టింది. అందుకే ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సినిమాలు మానేశాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక డ్యాన్స్ స్కూల్ అయినా పెట్టాలనుకున్నా.. డ్యాన్స్ స్టెప్పులు కూడా మర్చిపోవడంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నట్లు తెలిపారు.
అభినయ ‘సితార’ ప్రస్థానం..
వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’తో కెరీర్ మొదలుపెట్టిన భానుప్రియ.. ‘అన్వేషణ’, ‘దొంగమొగుడు’, ‘పెదరాయుడు’ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ఛత్రపతి’, ‘అన్నమయ్య’ వంటి సినిమాలతో మెప్పించినా.. ఇప్పుడు మతిమరుపు ఆమె కెరీర్‌కు బ్రేక్ వేసింది. చివరగా ఆమె తెలుగులో ‘నాట్యం’ సినిమాలో మెరిశారు.
స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఒక నటి.. ఇప్పుడు ఇలా మతిమరుపుతో బాధపడుతూ ఒంటరిగా మారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.
