
పైరసీ నుంచి కోట్ల వరకు… iBomma రవి అరెస్ట్ వెనుక షాకింగ్ నిజాలు
సైబర్ క్రైమ్ పోలీసులు చివరకు ఇమ్మడి రవి అలియాస్ iBomma రవిను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారుల కస్టడీలో ఉన్నారు. విచారణలో రవి తన ప్రయాణం గురించి కీలక విషయాలు వెల్లడించాడు.
ఇతని భార్యే రవిని హైదరాబాద్‌కు చేరుకున్న సమాచారం ఇచ్చిందని వస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు వార్త అని పోలీసులు స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా రవి కదలికలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. రవికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని పోలీసులు పట్టుకుని ప్రశ్నించగా—రవి హైదరాబాద్‌కు వచ్చాడని తెలుసుకున్నారు.
దీంతో ఒక ప్రత్యేక బృందం రవి నివాసానికి దూసుకెళ్లి అతన్ని అరెస్ట్ చేసింది. శోధనలో రూ. 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం రవికి చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడానికి చర్యలు ప్రారంభించారు.
అత్యంత హైప్రొఫైల్ హ్యాకర్‌గా పేరున్న రవి, తన భార్యతో 2017లో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని కూడా విచారణలో వెల్లడించాడు. ఈ మధ్యనే హైదరాబాద్, విశాఖలో ఉన్న తన ఆస్తులను అమ్మేందుకు రియల్ ఎస్టేట్ సంస్థను కూడా సంప్రదించినట్టు తెలిసింది.
కోవిడ్ కాలంలో iBomma సహా పలు పైరసీ సైట్లు బాగా ప్రాచుర్యం పొందాయి. రవి పైరసీ సినిమాలు, బెట్టింగ్ యాప్స్ ద్వారా సంవత్సరాల పాటు సుమారు రూ. 20 కోట్లు సంపాదించినట్టు అంగీకరించాడు. అతని వద్ద ఉన్న నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, నకిలీ పాన్ కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
