
పవన్ కళ్యాణ్ ‘సీక్రెట్’ సాయం బట్టబయలు! అల్లు అర్జున్ మేనేజర్‌నే ఆశ్చర్యపరిచిన ఆ సంఘటన ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి తరుణంలో బన్నీ మేనేజర్ శరత్ చంద్ర చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ చేసిన ఒక గొప్ప సహాయాన్ని వివరిస్తూ ఆయన షేర్ చేసిన విషయాలు చూసి మెగా మరియు అల్లు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
పిఠాపురం డ్రైవర్ కన్నీటి గాథ.. పవన్ రియాక్షన్!
శరత్ చంద్ర ఒకసారి కాకినాడ వెళ్తున్న సమయంలో పిఠాపురానికి చెందిన ఒక డ్రైవర్ తన బాధను పంచుకున్నాడట. దాదాపు 50 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే వింత వ్యాధితో తన కుమార్తె బాధపడుతోందని, ఎంతమందిని వేడుకున్నా ఫలితం లేదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను ఆపి తన బిడ్డ పరిస్థితిని చెప్పగా, పవన్ చలించిపోయి వెంటనే స్పందించారు.
సొంత జీతం నుంచి నిధులు.. నెలకు రూ. 12,000 సాయం!
పవన్ కేవలం ఆ చిన్నారికి హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స అందేలా చూడటమే కాకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత నిధుల నుంచి ఆ బిడ్డ కోసం ప్రతి నెలా రూ. 12,000 చొప్పున సాయం చేస్తున్నారు. ప్రచారం కోరుకోకుండా పవన్ చేస్తున్న ఈ సాయం గురించి తెలిసి బన్నీ మేనేజర్ ఆశ్చర్యపోయారు.
48 మంది అనాథ చిన్నారులకు పవన్ అండ!
కేవలం ఆ ఒక్క పాపకే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 48 మంది అనాథ చిన్నారుల బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిసిన సత్య, చైతన్య అనే ఇద్దరు చిన్నారుల దీనగాథకు కూడా ఆయన చలించిపోయి వారిని తన సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ 48 మంది చిన్నారుల పోషణ కోసం తన సొంత జీతం నుండి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున అందజేస్తున్నారు. తన పదవీకాలం ముగిసే వరకు ఈ సాయం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం విశేషం.
