డిసెంబర్ 19న విడుదలైన అవతార్ ఫైర్ అండ్ యాష్ మీద ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. విజువల్స్ పరంగా మరోసారి జేమ్స్ క్యామరూన్ మ్యాజిక్ చూస్తామని అభిమానులు ఆశించారు. కానీ సినిమా రిలీజైన తర్వాత పరిస్థితి మారిపోయింది. టెక్నికల్‌గా అద్భుతంగా ఉన్నా, కథ విషయంలో మాత్రం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
నెమ్మదిగా సాగే కథనం, పాత అవతార్ ఫార్ములానే మరోసారి చూపించారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. దాదాపు మూడున్నర గంటల నిడివి సాధారణ ప్రేక్షకులకు భారంగా మారింది. వీరాభిమానులు మాత్రమే సినిమాను ఎంజాయ్ చేస్తే, న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఆసక్తి చూపించలేదు. దాంతో వీకెండ్ తర్వాత థియేటర్లలో ఆక్యుపెన్సీలు ఒక్కసారిగా పడిపోయాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇండియాలో ఇప్పటివరకు సుమారు 85 కోట్ల రూపాయల వసూళ్లకే పరిమితమైంది. అయితే ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు మాత్రం 450 కోట్లకు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ టార్గెట్ చేరడం అసాధ్యమనే మాటే వినిపిస్తోంది.
దీనికి తోడు దురంధర్ సినిమా దూకుడు ఇంకా కొనసాగుతుండటం, తెలుగు తమిళ భాషల్లో వరుసగా కొత్త సినిమాలు విడుదల కావడం అవతార్‌కు మరింత దెబ్బగా మారాయి. వీక్ డేస్‌లో ఆక్యుపెన్సీలు ఇరవై శాతం లోపే ఉండటం బయ్యర్ వర్గాలను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఆదివారం కొంతవరకు హౌస్‌ఫుల్స్ పడినా, సోమవారం నుంచి వచ్చిన భారీ డ్రాప్ ట్రేడ్‌కు డేంజర్ సిగ్నల్లా మారింది.
ఈ పరిస్థితి చూస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ మన దేశంలో డిజాస్టర్‌గా మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఫ్రాంచైజ్‌ను కొనసాగించనని గతంలో జేమ్స్ క్యామరూన్ చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. ఆయన ఆ మాటపై నిలబడతారా, లేక ప్లాన్ మార్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అవతార్ 4 ఒకవేళ వస్తే, మునుపటి భాగాల్లా భారీ హైప్ రావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అవతార్, అవతార్ ది వే ఆఫ్ వాటర్‌తో పోలిస్తే, అవతార్ ఫైర్ అండ్ యాష్ చాలా వెనుకబడిపోయిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నూట యాభై కోట్ల మార్క్ కూడా దాటుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు ప్రపంచాన్ని కట్టిపడేసిన అవతార్ బ్రాండ్, ఇప్పుడు ఇండియాలో మాత్రం అంచనాలకు దూరమవుతుండటం సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్‌లా మారింది.
