గచ్చిబౌలి ప్రిజం క్లబ్ లో మే 29న చోటుచేసుకున్న ఒక వివాదం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. టాలీవుడ్ నటి కల్పిక గణేశ్ పై క్లబ్ యజమాని దీపక్ బజాజ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే… ఆ రోజున క్లబ్‌కి వెళ్లిన కల్పిక, సుమారు రూ.2,200 బిల్ చేసిన తర్వాత, ‘కాంప్లిమెంటరీ కేక్’ కావాలని మేనేజర్‌ను అడిగారని తెలుస్తోంది. మేనేజర్ అంగీకరించకపోవడంతో కల్పిక ఆగ్రహానికి లోనై, అక్కడే గొడవకు దిగారని క్లబ్ యజమాని ఆరోపిస్తున్నారు.
కేవలం ఇక్కడితోనే ఆగలేదట. క్లబ్ మేనేజ్మెంట్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నటి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని, తనను మేనేజర్‌తో పాటు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని అసత్య ఆరోపణలు చేశారని క్లబ్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక, క్లబ్‌లోని సామగ్రిని ధ్వంసం చేసినట్టు కూడా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, గచ్చిబౌలి పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.