
జగపతిబాబుకు తృటిలో తప్పిన ప్రాణాపాయం! ‘పెట్టెలో’ పెట్టి భూమిలో పూడ్చేశారు.. మరణం అంచు దాకా వెళ్లి వచ్చిన జగ్గూ భాయ్!
టాలీవుడ్ రొమాంటిక్ హీరో, ఫ్యామిలీ మ్యాన్ జగపతిబాబు అంటే తెలియని వారుండరు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన, నిజ జీవితంలో ఒక భయంకరమైన మరణగండాన్ని చవిచూశారు. ‘జగపతి’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చనిపోయారని అందరూ భావించే లోపే ఒక అద్భుతం జరిగి ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ‘రా టాక్స్ విత్ వీకే’ పాడ్‌కాస్ట్‌లో ఆయన పంచుకున్న ఈ షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నిజంగానే భూమిలో పూడ్చేశారు!
‘జగపతి’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, కథ ప్రకారం జగపతిబాబును ఒక పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చి పెట్టాలి. రియలిస్టిక్ గా ఉండాలని ఆయన నిజంగానే ఆ పెట్టెలోకి వెళ్లారు. అయితే ఆ పెట్టెకు గాలి ఆడేందుకు ఏమాత్రం గ్యాప్ లేకపోవడంతో, లోపల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆ సీన్ అయిపోయిన తర్వాత యూనిట్ సభ్యులు ఆ పెట్టెను తీసి పక్కన పెట్టి మర్చిపోయారు.
చనిపోయారనుకుని అంతా కన్నీళ్లు.. కానీ!
చాలాసేపటి వరకు జగపతిబాబు పెట్టెలో నుంచి బయటకు రాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆయన చనిపోయి ఉంటారని భావించి యూనిట్ సభ్యులు ఏడవడం కూడా మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఆయన మృత్యువును జయించి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశేషమేమిటంటే, ఈ ఘటన జరగడానికి ముందే ఒక లేడీ ఆస్ట్రాలజర్ ఆయనకు ఫోన్ చేసి ‘జాగ్రత్తగా ఉండండి’ అని హెచ్చరించడం గమనార్హం.
తండ్రికి కూడా విమాన ప్రమాదం నుండి గండం!
జగపతిబాబు తండ్రి వి.బి. రాజేంద్రప్రసాద్ గారికి కూడా ఇలాగే ఒక విచిత్రమైన మరణగండం తప్పిందట. ఒకసారి ఆయన ముంబయి నుండి హైదరాబాద్ రావాల్సిన విమానం క్రాష్ అయ్యి అందులోని వారంతా చనిపోయారు. కానీ, విమానం ఆలస్యం అవుతుందన్న కోపంతో టికెట్ చింపేసి హోటల్‌కు వెళ్లిపోవడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇది తన తల్లి చేసిన పూజల ఫలమేనని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
