
కోర్టుకెక్కిన విజయ్ చివరి సినిమా.. సంక్రాంతికి రావడం లేదని తేల్చేసిన హైకోర్టు!
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నటిస్తున్న చివరి చిత్రం “జననాయకన్” (తెలుగులో ‘జననాయకుడు’) విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలుస్తుందని ఆశించిన ఈ చిత్రానికి సెన్సార్ వివాదం పెద్ద అడ్డంకిగా మారింది.
కోర్టు తీర్పుతో సీన్ రివర్స్!
ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు ఇస్తూ, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో సంక్రాంతి పండుగ లోపు సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని స్పష్టమైంది.
అసలేం జరిగింది?
నిజానికి, శుక్రవారం ఉదయం సింగిల్ జడ్జి బెంచ్ ఈ సినిమాకు ‘UA’ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును (CBFC) ఆదేశించింది. అయితే, దీనిపై సెన్సార్ బోర్డు వెంటనే అప్పీల్ చేసింది. తమ వాదన వినకుండానే ఈ ఆర్డర్ ఇచ్చారని, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు.
పండగ తర్వాతే నిర్ణయం!
రెండు వైపుల వాదనలు విన్న కోర్టు, ఈ కేసును పొంగల్ సెలవుల తర్వాత అంటే జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే ముందు విజయ్ నుండి వస్తున్న ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ సినిమా థియేటర్లలోకి రావడం కష్టమే.
