సినిమా వార్తలు

మేడారం వివాదం : చేతులెత్తి క్షమించమని వేడుకున్న హీరోయిన్

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఊహించని వివాదం ఒకటి చోటుచేసుకుంది. ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హీరోయిన్ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తక్కెడలో పెట్టి బెల్లం (బంగారం) తూకం వేయించడంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. గిరిజన ఆచారాలను కించపరిచారంటూ నెటిజన్లు ఫైర్ అవ్వడంతో, తాజాగా ఆమె స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు.

అసలేం జరిగిందంటే?

టీనా శ్రావ్య తన ప్రాణంగా చూసుకునే 12 ఏళ్ల పెంపుడు కుక్కకు ఇటీవల ట్యూమర్ సర్జరీ జరిగింది. అది కోలుకోవాలని ఆమె సమ్మక్కకు మొక్కుకుంది. కుక్క ఆరోగ్యంగా నడవడంతో తన మొక్కు చెల్లించుకోవడానికి కుక్కను మేడారం తీసుకెళ్లి దాని బరువుకు సరిపడా బెల్లం తూకం వేయించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో రచ్చ మొదలైంది.

భక్తితోనే చేశాను.. కానీ తప్పు తెలుసుకున్నా!

విమర్శలు వెల్లువెత్తడంతో టీనా శ్రావ్య ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు:

“నా కుక్క కోలుకోవాలని భక్తితో, ప్రేమతో మాత్రమే మొక్కు తీర్చుకున్నాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. గిరిజనుల ఆచారం ప్రకారం జంతువులతో అలా తూకం వేయించడం తప్పని నాకు తర్వాత తెలిసింది. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి.”

“మన సాంప్రదాయాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఇకపై ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగనివ్వను. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించండి” అంటూ చేతులెత్తి వేడుకుంది.

మేడారం విశిష్టత..

కోట్లాది మంది భక్తులు కొలిచే సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులు తమ బరువుకు తూగేలా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించడం ఆనవాయితీ. అయితే జంతువులను తక్కెడలో ఉంచడం ఆచార విరుద్ధమని భక్తులు మండిపడుతున్నారు. టీనా శ్రావ్య క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం సర్దుమణుగుతుందని భావిస్తున్నారు.

Similar Posts