సినిమా వార్తలు

షాకింగ్: ప్రభాస్ సెట్స్‌కి రావడం లేదు! సందీప్ వంగా ‘స్పిరిట్’కు మళ్ళీ బ్రేక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే కానీ, ఆయన ప్లానింగ్ మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్‌ను టెన్షన్‌లో పెట్టేస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో అనౌన్స్ చేసిన ‘స్పిరిట్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గతేడాదే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్, ప్రభాస్ కాల్షీట్ల సర్దుబాటు వల్ల 2026కి వాయిదా పడింది. అయితే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ షూటింగ్‌కు ప్రభాస్ మరోసారి బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది.

సందీప్ వంగాకు మొండిచేయి.. ‘ఫౌజీ’కే మొగ్గు!

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కోసం ప్రభాస్ సడన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్ల రిక్వెస్ట్ మేరకు, మిగతా సినిమాల కంటే ‘ఫౌజీ’కే టాప్ ప్రయారిటీ ఇస్తూ ఈ ఏడాదిలోనే దీన్ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారు. దీనివల్ల ‘స్పిరిట్’ కోసం కేటాయించాల్సిన బల్క్ డేట్స్ కాస్తా ఇప్పుడు హను సినిమా ఖాతాలోకి వెళ్లిపోయాయి.

లెజెండ్స్‌ను లైన్‌లో పెట్టిన కల్కి.. స్పిరిట్ పరిస్థితి ఏంటి?

మరోవైపు ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కూడా లైన్లోకి వచ్చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు ప్రభాస్ కోసం సెట్స్‌పై ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, త్వరలోనే ప్రభాస్ ఆ టీమ్‌తో జాయిన్ కాబోతున్నారు. ఇలా ఒకేసారి రెండు భారీ చిత్రాలను భుజాన వేసుకోవడంతో, సందీప్ వంగా ప్రాజెక్ట్ మళ్ళీ వెనక్కి నెట్టబడింది. రీసెంట్‌గా గోవాలో ప్రభాస్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తి చేసిన సందీప్, డార్లింగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతానికి షూటింగ్ ఆలస్యమైనా, మేకర్స్ మాత్రం మార్చి 5, 2027న ‘స్పిరిట్’ను రిలీజ్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ డెడ్‌లైన్ లోపు వంగా మార్క్ యాక్షన్‌ను ప్రభాస్ పూర్తి చేస్తారో లేదో చూడాలి!

Similar Posts