
నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సిద్ధార్థరెడ్డి వెంటనే లొంగిపోవాలి! పోస్ట్‌మార్టంపై కోర్టు షాకింగ్ కామెంట్స్!
రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో పెను సంచలనం సృష్టించిన వర్ధమాన నటి ప్రత్యూష (Prathyusha) మరణం కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ, అతడు వెంటనే పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.
హైకోర్టు శిక్షే ఫైనల్.. 4 వారాల్లో లొంగిపోవాలి!
గతంలో హైకోర్టు సిద్ధార్థరెడ్డికి విధించిన రెండేళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. రాబోయే నాలుగు వారాల్లోగా సిద్ధార్థరెడ్డి కోర్టు ముందు లేదా పోలీసుల వద్ద లొంగిపోవాలని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో కీలక ఘట్టం ముగిసినట్లయింది.
పోస్ట్‌మార్టం నిర్వహించిన తీరుపై సుప్రీం అసహనం!
ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష మరణించిన సమయంలో నిర్వహించిన పోస్ట్‌మార్టం (Post-mortem) పద్ధతి సరిగా లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో పేర్కొన్న అంశాలు, పోస్ట్‌మార్టం జరిగిన తీరుపై కోర్టు అనుమానాలను వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం హైకోర్టు ఇచ్చిన శిక్షే సరైనదని అత్యున్నత న్యాయస్థానం భావించింది.
అసలు ఆ రోజు ఏం జరిగింది? ( 2002)
ప్రేమ – విషాదం: ఇంటర్ చదువుతున్న రోజుల్లో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి రాగా, సిద్ధార్థ ఇంజనీరింగ్ లో చేరాడు.
ఘటన: 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ కూల్‌డ్రింక్‌లో పురుగుమందు (ఆర్గానోఫాస్ఫేట్) కలుపుకుని తాగి ఆసుపత్రిలో చేరారు.
మరణం: ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
దర్యాప్తు: లైంగిక దాడి జరగలేదని అప్పట్లో వైద్యులు చెప్పినా, తల్లి సరోజినీదేవి మాత్రం ఇది పక్కా హత్యే అని పోరాడారు. సీబీఐ రంగంలోకి దిగి సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు పురికొల్పినట్లు చార్జిషీట్ దాఖలు చేసింది.
24 ఏళ్ల తల్లి పోరాటం!
తమకు న్యాయం జరగలేదని, నిందితుడికి శిక్ష పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012 నుండి సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. నిందితుడు సిద్ధార్థరెడ్డికి సెషన్స్ కోర్టు మొదట 5 ఏళ్ల శిక్ష వేయగా, హైకోర్టు దానిని 2 ఏళ్లకు తగ్గించింది. ఇప్పుడు ఆ రెండేళ్ల శిక్షనైనా సిద్ధార్థరెడ్డి అనుభవించక తప్పదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
