బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. అయితే ఈసారి అది ఏదో యాక్షన్ సినిమా గురించో, లేక వివాదం గురించో కాదు.. ఆయన అంగీకరించిన ఒక “డ్రీమ్ ప్రాజెక్ట్” ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 1100 పేజీల భారీ పరిశోధనతో రూపొందిన ఒక ప్రత్యేకమైన కథతో సంజయ్ దత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఏమిటా ‘ఆఖరి సవాల్’?
సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ఆఖరి సవాల్’ అనే సినిమా పట్టాలెక్కుతోంది. జాతీయ అవార్డు విన్నర్ అభిజీత్ మోహన్ వరాంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొన్ని అంశాలను ప్రపంచానికి చూపించబోతున్నట్లు చెప్తున్నారు. అయితే అది RSS ప్రచారం కోసం తీస్తున్న చిత్రం అనే వినపడుతోంది. ఇందులో ఒక ప్రొఫెసర్, విద్యార్థి మధ్య జరిగే మేధోమథనం చుట్టూ ఈ కథ సాగుతుంది. 2026 నాటికి RSS స్థాపించి వంద ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఆ లోపే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గురుదక్షిణగా సినిమా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక సంస్థను ప్రమోట్ చేయడానికి తీస్తున్న ‘ప్రొపగండా’ సినిమా అని కొందరు విమర్శిస్తుంటే.. నిర్మాత నిఖిల్ నంద మాత్రం దీన్ని ఖండిస్తున్నారు.
ఈ సినిమాను నిర్మిస్తున్న నిఖిల్ నంద ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. “నేను 40 ఏళ్లుగా ఒక సామాజిక సంస్థతో (RSS) మమేకమై ఉన్నాను. ఈ సినిమా నా గురుదక్షిణ” అని ఆయన పేర్కొన్నారు. తను ఇన్నేళ్లుగా ఆ సంస్థతో ఉన్న అనుబంధానికి గుర్తుగా, తన సొంత నిధులతో ఈ సినిమాను తీస్తున్నానని ఆయన చెప్పారు. ఎవరి దగ్గరా ఫండింగ్ తీసుకోకుండా, పబ్లిసిటీ ఆశించకుండా పనిచేసే స్వయంసేవకుల నిజాయితీని ఇందులో చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏవైనా సిద్ధాంతాల గురించి పుస్తకాల్లో ఉన్నవి కాకుండా, వాస్తవాలను చర్చల రూపంలో పెట్టబోతున్నామని చెప్పారు. ప్రచారం కోసం కాకుండా, ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానం ఇవ్వడమే ఈ సినిమా లక్ష్యమని ఆయన వివరించారు.
భారీ తారాగణం.. 2026 టార్గెట్!
ఈ సినిమాలో కేవలం సంజయ్ దత్ మాత్రమే కాదు, ఒకప్పటి క్రేజీ హీరోయిన్ సమీరా రెడ్డి దాదాపు పుష్కర కాలం (12 ఏళ్ల) తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించబోతోంది. ఆమెతో పాటు అమిత్ సాధ్, నీతూ చంద్ర వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతా, ముంబై పరిసరాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. 2026 నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్.
సాధారణంగా సంజయ్ దత్ సినిమాలంటే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ, ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇలాంటి లోతైన సిద్ధాంతపరమైన సినిమాను ఎంచుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఇది కేవలం సినిమానా? లేక ఒక వర్గం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమా? అనే ప్రశ్నలు విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా, సంజు బాబా చేయబోతున్న ఈ ‘ఆఖరి సవాల్’ కు సంబందించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

