సినిమా వార్తలు

“అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు”.. చిరంజీవి వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్?

టాలీవుడ్ లో ‘కాస్టింగ్ కౌచ్’ (Casting Couch) ఉందా? లేదా? ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. “అమ్మాయిలు స్ట్రిక్ట్ గా ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు, కాస్టింగ్ కౌచ్ లేదు” అంటూ చిరు తన కూతురు సుష్మిత గురించి చెబుతూ కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) మాత్రం చిరు వ్యాఖ్యలకు భిన్నంగా స్పందిస్తూ ఇండస్ట్రీలోని చేదు నిజాలను కడిగి పారేశారు.

జమీందార్ల కాలం నుంచే అది ఉంది:

తమ్మారెడ్డి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని మనం చెప్పలేం. 1930ల్లో సినిమాలు మొదలైనప్పుడు అంతా బాగానే ఉండేది. కానీ ఆ తర్వాత జమీందారులు, రాజులు సినిమాల్లోకి ఎంటర్ అయ్యాక కథ మారింది. కేవలం అమ్మాయిలను అనుభవించడం కోసమే సినిమాలు తీసే కల్చర్ అప్పుడే మొదలైంది” అంటూ షాకింగ్ హిస్టరీని బయటపెట్టారు.

సంవత్సరానికి 200 సినిమాలు.. ఎందుకో తెలుసా?

ప్రస్తుత పరిస్థితులపై ఆయన మరింత ఘాటుగా స్పందించారు. “ఇప్పుడు ఏడాదికి 200 సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని ఎందుకు తీస్తున్నారో కూడా తెలియదు. కొంతమంది కేవలం అమ్మాయిల పిచ్చితో, వాళ్ళను వాడుకోవడానికే సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ వ్యవహారమే వేరు” అంటూ ఇండస్ట్రీలోని బ్లాక్ షీప్స్ గురించి ఓపెన్ అయ్యారు. అయితే సీరియస్ గా సినిమాలు తీసే పెద్ద వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు.

చిన్మయి వ్యవహారంపై సంచలనం:

సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) గురించి మాట్లాడుతూ.. “వేధింపులకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమెపై నిషేధం విధించడం దారుణం. ఆమె ఎవరికీ లొంగలేదు, ఎవ్వరి ముందూ వంగలేదు. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి” అని తమ్మారెడ్డి మద్దతు పలికారు. తెలుగు ఇండస్ట్రీ ఆమెకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.

మొత్తానికి టాలెంట్ ఉంటే ఎవ్వరూ తొక్కలేరని చెబుతూనే.. ఇండస్ట్రీలో 5-10 శాతం మంది కామాంధులు ఇంకా ఉన్నారని తమ్మారెడ్డి కుండబద్దలు కొట్టారు. మెగాస్టార్ ‘ఆల్ ఈజ్ వెల్’ అంటే.. తమ్మారెడ్డి మాత్రం ‘సంథింగ్ ఈజ్ రాంగ్’ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది!

Similar Posts