తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సామాన్య నటుడిని ‘మెగాస్టార్’గా మార్చిన అద్భుతం ‘ఖైదీ’. అక్టోబర్ 28, 1983న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ఇప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటాయి. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి, ఒక కొత్త మాస్ ఐకాన్‌ను మనకు పరిచయం చేసింది ఈ చిత్రం. హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఫస్ట్ బ్లడ్’ స్ఫూర్తితో వచ్చిన ఈ కథలో, చిరంజీవి నటన హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్‌ను గుర్తుకు తెచ్చింది.
లక్షల రెమ్యునరేషన్.. కోట్ల వసూళ్లు!
అప్పట్లో చిరంజీవి పారితోషికం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సినిమా కోసం ఆయన తీసుకున్నది కేవలం రూ. 1.75 లక్షలు మాత్రమే! కానీ, ఈ చిత్రం సాధించిన వసూళ్లు మాత్రం ఏకంగా రూ. 8 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి. చిరంజీవి కెరీర్‌లో కోటి రూపాయల షేర్ వసూలు చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాత ఎం. తిరుపతి రెడ్డి నమ్మకాన్ని, పరుచూరి సోదరుల పవర్‌ఫుల్ డైలాగ్స్ నిజం చేశాయి.
ట్రెండ్ సెట్టర్ సూర్యం.. ఆ డ్రెస్ వెనుక కథ!
ఈ సినిమాలో చిరంజీవి వేసుకున్న నల్లటి స్లీవ్‌లెస్ టీషర్ట్, ప్యాంట్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ స్టైల్‌ను చిరంజీవి స్వయంగా డిజైన్ చేసుకోవడం మరో విశేషం. ప్రతీ కుర్రాడు సూర్యంలా కనిపించాలని ఆరాటపడేలా చేసింది ఆ లుక్. దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.
ఖైదీ సెంటిమెంట్.. అప్రతిహత జైత్రయాత్ర!
‘ఖైదీ’ అనే పేరు చిరంజీవికి ఒక లక్కీ మస్కట్‌లా మారిపోయింది. అందుకే ‘ఖైదీ నెం. 786’, రాజకీయాల తర్వాత రీఎంట్రీలో ‘ఖైదీ నెం. 150’ అంటూ ఆయన చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 157 సినిమాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్, ఇప్పుడు ‘విశ్వంభర’తో గ్లోబల్ ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు లక్షల్లో పారితోషికం తీసుకున్న చిరు, నేడు 60 ఏళ్లు దాటినా రూ. 70 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా అందుకుంటూ తిరుగులేని కింగ్‌లా కొనసాగుతున్నారు!

