సినిమా వార్తలు

విక్టరీ వెంకటేష్ ఇంట్లో RSS చీఫ్! పాలిటిక్స్‌కు దూరంగా ఉండే వెంకీ సడన్ నిర్ణయం వెనుక మర్మమేంటి?

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ అంటేనే వివాదాలకు ఆమడదూరం. ఇండస్ట్రీలో ఆయనను అందరూ ‘మంచి మనిషి’గా, ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తిగా గౌరవిస్తారు. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే వెంకటేష్, తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ కి తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఎప్పుడూ లేనిది వెంకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఏవైనా రాజకీయ సమీకరణాలు ఉన్నాయా?

వెంకీ పంథాకు భిన్నంగా.. ఇది ‘విక్టరీ’ మూవ్‌నా?

వెంకటేష్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి డి. రామానాయుడు గారు గతంలో ఎంపీగా పనిచేశారు. అన్న సురేష్ బాబుకు రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ వెంకటేష్ మాత్రం ఎప్పుడూ ఏ రాజకీయ వేదిక పైనా కనిపించలేదు.

కూతురి కోసం కూడా రాలేదు:

మొన్నటి ఎన్నికల్లో వెంకటేష్ పెద్దమ్మాయి తన మామగారి (ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ) తరపున ప్రచారం చేసినా.. వెంకీ మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతటి ‘అపొలిటికల్’ పర్సన్ ఇప్పుడు నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను కలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

శతాబ్ది ఉత్సవాల వేళ.. ఆధ్యాత్మిక కనెక్షనా?

ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 ఏళ్లు కావస్తున్న తరుణంలో మోహన్ భగవత్ దేశవ్యాప్తంగా ప్రముఖులను కలుస్తున్నారు. అందులో భాగంగానే మణికొండలోని వెంకటేష్ నివాసానికి ఆయన విచ్చేశారని చెప్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక రాజకీయ విభాగంగా కంటే, ఒక సాంస్కృతిక సంస్థగా వెంకటేష్ చూస్తున్నారా? లేక బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నమా? అన్న చర్చ మొదలైంది. అయితే వెంకటేష్ కు ఉన్న ఆధ్యాత్మిక భావజాలం రీత్యా, ఇది కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సినిమా కెరీర్ & పొలిటికల్ మైలేజ్:

ప్రస్తుతం వెంకటేష్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక సిద్ధాంతపరమైన సంస్థకు దగ్గరవ్వడం వల్ల ఆయన సినిమాలపై ఏవైనా ప్రభావం ఉంటుందా? అన్నది కూడా ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, సైలెంట్‌గా ఉండే వెంకీ.. తన ఇంటికి మోహన్ భగవత్‌ను పిలిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

Similar Posts