ఆ నాడు గ్రౌండ్‌లో బ్యాట్ పడిపోయింది.. కానీ ఈ నాడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధలైపోతున్నాయి! టీమిండియా స్టార్ క్రికెటర్ కావాల్సిన ఆ యువకుడు, కుట్రల వల్ల కనుమరుగైపోయాడని భావించిన వారందరికీ తన సక్సెస్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్నాడు.
‘ధురంధర్-2’.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా పేరు వింటేనే బాక్సాఫీస్ గజగజ వణుకుతోంది. వందల కోట్లు కొల్లగొడుతూ బాలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన ‘ఆదిత్య ధర్’ ఎవరో కాదు, ఒకప్పుడు టీమిండియా జెర్సీ ధరించాలని కలలు గన్న అద్భుతమైన ఆల్‌రౌండర్. కేవలం మూడే సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఒక చీకటి కోణం ఉంది. అది తెలుసుకుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పాటుకు గురికావాల్సిందే.

రాజకీయాలకు బలైపోయిన టాలెంట్:
ఢిల్లీ అండర్-19 జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌గా వెలుగుతున్న ఆదిత్య ధర్, 2002 అండర్-19 వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికవ్వడం ఖాయమని అందరూ భావించారు. కానీ సరిగ్గా అక్కడే అసలు డ్రామా మొదలైంది. ఆదిత్య ధర్ కంటే తక్కువ ప్రతిభ ఉన్న స్టువర్ట్ బిన్నీని జట్టులోకి తీసుకున్నారనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఎంపిక వెనుక స్టువర్ట్ బిన్నీ తండ్రి, 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్నీ చక్రం తిప్పారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. తనకంటే తక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చి, తనను తొక్కేయడం తట్టుకోలేక ఆదిత్య కన్నీళ్లతో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.

రాసిన రాతను మార్చి రాశాడు:
క్రికెట్ కల చెదిరినా ధైర్యం కోల్పోని ఆదిత్య, ముంబై చేరుకుని సినిమా రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రచయితగా ప్రయాణం మొదలుపెట్టి, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో డైరెక్టర్‌గా మారి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ‘ధురంధర్’ పార్ట్ 1 మరియు తాజాగా విడుదలైన పార్ట్ 2 చిత్రాలతో ఆదిత్య ధర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే టీమిండియా క్రికెటర్లు ఆదిత్య సినిమాల కోసం క్యూ కడుతుండటం విశేషం.

బాక్సాఫీస్ ‘ధురంధరుడు’:
నటి యామీ గౌతమ్‌ను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలోనూ హ్యాపీగా ఉన్న ఆదిత్య, ఇప్పుడు బాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. టాలెంట్ ఉంటే ఎవరూ తొక్కేయలేరని, ఒక తలుపు మూసుకుంటే మరో అద్భుతమైన ప్రపంచం ఎదురుచూస్తుందని ఆదిత్య నిరూపించాడు. క్రికెట్ పాలిటిక్స్‌కు బలైనా, సినిమా ఇండస్ట్రీలో సునామీ సృష్టించిన ఈ డైరెక్టర్ కథ నిజంగా ఒక ఇన్స్పిరేషన్.

