మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఉద్దేసించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ముగింపులో ఉన్న ఒక చిన్న లాజిక్ గురించి ఆయన ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. అది కూడా ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ చమత్కరించడం విశేషం.
ఆ చేప ఏమైంది? ఆ రింగ్ ఎక్కడ ఉంది?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన జగదేకవీరుడు -అతిలోక సుందరి సినిమా గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ క్లైమాక్స్‌లో ఒక విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు తన ఉంగరాన్ని నీళ్లలో పడేస్తారు. ఆ ఉంగరాన్ని ఒక చేప మింగేస్తుంది. అక్కడితో సినిమా అయిపోయింది. కానీ ఆ చేప ఏమైంది? ఆ రింగ్ ఎక్కడ ఉంది?” అని రామ్ చరణ్ ప్రశ్నించారు.
నాగ్ అశ్విన్‌కు డిమాండ్
గడిచిన 30 ఏళ్లుగా ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదని, దీనికి జవాబు చెప్పగలిగే సత్తా కేవలం నాగ్ అశ్విన్‌కే ఉందని చరణ్ అన్నారు. “నాగ్ అశ్విన్ గారు, మా జనరేషన్ అందరి తరపున మిమ్మల్ని అడగట్లేదు.. డిమాండ్ చేస్తున్నాను! త్వరలోనే ఆ రింగ్ ఏమైందో ఒక మంచి జవాబు ఇవ్వాలి” అంటూ చమత్కరించారు.
రామ్ చరణ్ అడిగిన ఈ లాజికల్ ప్రశ్న చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బహుశా నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాగా జగదేక వీరుడు అతి లోక సుందరి సీక్వెల్ తీసి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతారేమో అని అభిమానులు సరదాగా చర్చించుకుంటున్నారు.

