ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు, సీనియర్ నటుడు షిహాన్ హుసైని (60) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఆధ్వర్యంలోనే హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కరాటేని నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
“ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుసైని గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుసైని గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది.
వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్లి హుసైని గారిని పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
చెన్నైలో హుసైని గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ‘ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు’ అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్లి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు- నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుసైని గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుసైని గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.
హుసైని గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్లేవారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుసైని గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం-ఆయన ఆలోచనా దృక్పథాన్ని వెల్లడించింది. హుసైని గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పత్రికా ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ సహా పలువురికి కరాటే, మార్షల్ ఆర్ట్స్, విలు విద్యలలో షిహాన్ హూసైనీ శిక్షణ ఇచ్చారు. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘పున్నాగ మన్నన్’తో 1986లో ఆయన వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేలైకారన్’ సినిమాలోనూ నటించారు.
తమిళంలో దళపతి విజయ్ ‘బద్రి’ సినిమాలో కరాటే కోచ్ రోల్ చేశారు. ఇటీవల మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార, సమంత జంటగా నటించిన ‘కాత్తువక్కుల రెండు కాదల్’ (తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజా), ‘చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్’ సినిమాల్లో నటించారు. కొన్ని రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా కూడా కనిపించారు.