తెలుగు సినిమా పరిశ్రమలో కార్మిక వేతనాల వివాదం మరో మలుపు తిరిగింది. వేతనాల్లో 30 శాతం పెంపు కోరుతూ షూటింగులను బంద్ చేసిన ఫిల్మ్ ఫెడరేషన్‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కఠినంగా స్పందించింది. వేతనాల పెంపును నిర్మాతలు ఏకగ్రీవంగా తిరస్కరించారని, అవసరమైతే యూనియన్‌లో లేని ఔత్సాహిక నిపుణులతోనూ షూటింగులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

యూనియన్ కాకపోయినా సరే… పని చేసే అవకాశం!

తాజా ప్రకటనలో TFCC కీలకంగా చెప్పిన విషయం ఏమిటంటే — “నిర్మాతలు చెల్లించగలిగే స్థాయిలో వేతనం కోరితే పనిచేయండి. లేదంటే, తక్కువ remunerationsకే సిద్ధంగా ఉన్న నైపుణ్యం గల ఇతరులకు అవకాశం ఇవ్వడంలో వెనుకాడబోము.”
అంటే, సినీ రంగంలోకి రావాలనుకునే ఎన్నోమంది యువ నిపుణులు యూనియన్ లో అడుగుపెట్టాలంటే లక్షల రూపాయలు వసూలు చేయడం వల్ల వెనక్కి తగ్గుతున్నారని చాంబర్ ఆరోపించింది. ఇది పరిశ్రమలో కొత్త కార్మికులకు అడ్డుపడుతోందని, టాలెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది.

“పెట్టుబడిదారుడే బేస్!” – నిర్మాతల వాదన

తెలుగు సినిమాకు ఇప్పటికే కోవిడ్, మార్కెట్ డౌన్‌టర్న్, OTT ప్రభావాలతో పెద్ద దెబ్బ తగిలిందని TFCC గుర్తుచేసింది. ఈ సమయంలో వేతనాలు పెంచమన్న డిమాండ్‌ను సమయానుకూలంగా లేనిదిగా అభివర్ణించింది. ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ఇక్కడి వేతనాలు ఎక్కువేనని చెప్పింది. నిర్మాతలకూ స్వేచ్ఛ ఉండాలని, వేతనాల శక్తికి తగ్గ కార్మికులను ఎంచుకునే హక్కు వారికి ఉందని చాంబర్ స్పష్టం చేసింది.

“సంఘాలు పరిశీలించాలి… పరిశ్రమకి నిర్మాతలే ధారకులు!”

పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్మాతల శ్రేయస్సు అనివార్యమని, కార్మిక సంఘాలు కూడా ఆ ఆ స్థితిని గుర్తించి వ్యవహరించాలని సూచించింది. పరిశ్రమలో పని చేసే ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని TFCC స్పష్టం చేసింది.

ఈ ప్రకటనతో ఫెడరేషన్ vs చాంబర్ వివాదం మరింత ఉదృతం అయ్యే అవకాశముంది. ఇప్పుడు యూనియన్ సభ్యత్వం లేని నిపుణులకు పెద్ద మార్గంలా, ఇండస్ట్రీలోకి ప్రవేశించే డోర్ లా ఈ ప్రకటన నిలుస్తుందా? లేక పరిశ్రమలో కార్మిక సంఘాల ప్రభావం ఇంకా గట్టిగానే ఉండనుందా అనేది చూడాలి.

,
You may also like
Latest Posts from