సినిమా వార్తలు

ఓటీటిలో విశ్వక్ సేన్ ‘ఫంకీ’ పరిస్థితి మరీ ఇంత దారుణమా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కాంబో అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ ‘ఫంకీ’ సినిమా మాత్రం ఊహించని రిజల్ట్ ఇచ్చింది. థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటిటిలో కూడా ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగులుతోంది. నవ్వు రాని జోకులతో సినిమాను లాగించేయాలని చూసిన డైరెక్టర్‌కు నెటిజన్లు గట్టిగానే సమాధానం చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోమ‌ల్ (విష్వ‌క్‌సేన్‌) ఓ కొత్త ద‌ర్శ‌కుడు. మంచి ప్రొడ‌క్ష‌న్స్ అనే నిర్మాణ సంస్థ‌లో అవ‌కాశం అందుకుని రూ.4 కోట్ల‌లో పూర్తి చేస్తాన‌ని చెప్పి ‘ఫంకీ’ అనే సినిమాని మొద‌లు పెడ‌తాడు. ఆ బ‌డ్జెట్ కాస్త రూ.40 కోట్ల‌కు చేరినా సినిమా పూర్తి కాదు. దాంతో మంచి నిర్మాత (న‌రేశ్‌) ఒత్తిడికి గురై ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌స్తుంది. అది తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (క‌యాదు లోహార్‌) సినిమా బాధ్య‌త‌ల్ని తీసుకుంటుంది. బ‌డ్జెట్‌ పెరగకుండా ద‌ర్శ‌కుడితో మూవీ చేయిస్తానని చెప్పి, రంగంలోకి దిగుతుంది. మ‌రి అనుకున్న బ‌డ్జెట్‌లోనే కోమ‌ల్‌తో సినిమాని పూర్తి చేయించిందా?అది పూర్త‌య్యేలోపు ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

కథలో బలం లేకపోవడం, కేవలం ప్రాసల కోసం పాకులాడటంతో ఆడియన్స్‌కు బోర్ కొట్టింది. ‘ఫంకీ’ సినిమాకు మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది. వన్ లైనర్లతో మ్యాజిక్ చేయాలనుకున్న అనుదీప్ ప్రయత్నం ఈసారి బెడిసికొట్టింది. అయితే హీరో విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయినా, తన దృష్టిలో ఇది సక్సెస్ మూవీ అని కామెంట్ చేసి ట్రోలర్స్ కు దొరికిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన తర్వాత విమర్శల డోస్ మరింత పెరిగింది. సరైన కథ లేకుండా కేవలం నవ్వు రాని జోకులతో సినిమాను నడిపించాలనుకోవడమే ఈ సినిమా కొంపముంచిందనేది అసలు నిజం.

ఈ సినిమా ఫలితం చూస్తుంటే కేవలం కామెడీ టైమింగ్‌ను నమ్ముకుంటే సరిపోదని, బలమైన కథాబలం కూడా ఉండాలని స్పష్టమవుతోంది. ముఖ్యంగా అనుదీప్ తన పాత ఫార్ములాను పక్కన పెట్టి కొత్తగా ఏదైనా ట్రై చేయాల్సిన సమయం ఆసన్నమైంది. విశ్వక్ సేన్ కూడా తన సినిమాల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటిటిలో వస్తున్న ఈ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Similar Posts