ఈ ఏడాది హాలీవుడ్ నుంచి అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాల్లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న ‘అవతార్ 3: అాష్ అండ్ ఫైర్’ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ మొదటి లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పాటు ట్రైలర్‌పై కీలక అప్‌డేట్ కూడా ప్రకటించారు.
ఈ కొత్త పోస్టర్‌లో ‘వరాంగ్’ అనే కొత్త పాత్ర పరిచయం చేయబడింది. ఇది పాండోరా యూనివర్స్‌లోని ఫ్రెష్ కేరెక్టర్ కాగా, ఈసారి కథలో ప్రధాన విలన్ గా నిలవనుంది. ఈ పాత్రలో ఊనా చాప్లిన్ నటించారు. ఆమె ఎవరో కాదు… కామెడీ దిగ్గజం చార్లీ చాప్లిన్ మనవరాలు!
ఈ లుక్ విడుదల చేయడమే కాకుండా, మేకర్స్ ట్రైలర్ ఎప్పుడొస్తుందో కూడా వెల్లడించారు. ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న ‘ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ మూవీతో పాటు అవతార్ 3 ట్రైలర్‌ను ప్రేక్షకులు స్క్రీన్ పై చూసే అవకాశం ఉండబోతోంది. జూలై 25న ఫాంటాస్టిక్ ఫోర్ థియేటర్లలోకి రానుంది.
ఇక 2022లో విడుదలైన అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ అనేది భారీ అంచనాల మధ్య వచ్చి మంచి కలెక్షన్లు సాధించినప్పటికీ, మొదటి భాగం స్థాయికి మాత్రం చేరలేకపోయింది. ఇప్పటికీ మొదటి అవతార్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రెండో భాగం మాత్రం మూడో స్థానంలో ఉంది. ఈ క్రిస్మస్ విడుదలవుతున్న అవతార్ 3 మాత్రం టాప్ స్పాట్ కోసం పోటీ పడుతుందా? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఇప్పటికే తెరపైకి వచ్చేశాయి.
గత భాగాల్లో సామ్ వర్థింగ్టన్, జోయి సల్డానా, స్టీఫెన్ లాంగ్, సిగోర్నీ వీవర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు వారి ప్రయాణం ఎంతలా మలుపులు తిరుగుతుందో చూడాలి!