శివ (సుధీర్ బాబు) కు కార్పోరేట్ కంపెనీలో జాబ్. అయితే అదే సమయంలో దెయ్యాలు,భూతాలు లేవని నిరూపించడం అతని ప్రవృత్తిగా పెట్టుకుంటాడు. కానీ ప్రతి రాత్రీ అతన్ని ఒక భయంకర కల వెంటాడుతూంటుంది. ఊయలలో పసిబిడ్డ, కత్తి పట్టుకున్న తన తల్లి కనపడుతూంటుంది. ఏమీ అర్దం కాదు. ఈ లోగా అతని స్నేహితుడు రుద్రారం అనే గ్రామంలో అనుమానాస్పదంగా చనిపోవడంతో, శివ అక్కడికి వెళ్తాడు. అక్కడ ఓ పాడుబడిన ఇంట్లో “లంకెబిందెలు”కి కాపలాగా ఉన్న ధనపిశాచి (సోనాక్షి సిన్హా) అనే శక్తి ఉందని, అదే తన స్నేహితుడుని బలి తీసుకుందని తెలుసుకుంటాడు. దాంతో దాని అంతు తేల్చి, అక్కడ పిశాచాలు, దెయ్యాలనేవి లేవు అని చెప్పాలనుకుంటాడు.

ఆ ప్రాసెస్ లో అతను ఊహించని కొన్ని నిజాలు తెలుస్తాయి. ధన పిశాచిని డైరక్ట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు గతంలో తనకూ ఆ పిశాచి కు మధ్య విరోధం ఉందని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో దెయ్యాలే నమ్మని శివ… పిశాచాలను నమ్మాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది. అప్పుడేమైంది. ఈ కథలోకి దైవం అయిన శివుడు ఎందుకు వస్తాడు..వంటి విషయాలు అన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

సినిమా మొదట్లో నిధుల రహస్యం, పిశాచ బంధనం గురించి ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్ సెట్ చేస్తారు. కానీ హీరో ఘోస్ట్ హంటర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత, స్టోరీ ఫ్లో కట్ అయిపోతుంది.
సైన్స్, సూపర్‌నేచురల్, లవ్ ట్రాక్, ఫ్లాష్‌బ్యాక్ అన్నీ కలగలిసి ఎక్కడో ఒక సెట్‌లో సగం ఫిల్మ్, సగం సీరియల్‌గా అనిపించే టోన్ వస్తుంది.

రచయిత మొదటి సగంలో ఏమాత్రం రివీల్ చేయకుండా ఆడియన్స్‌ని హ్యాంగ్‌లో ఉంచాడు. ఇంటర్వెల్ బ్లాక్‌కి వచ్చే సరికి — “ఇక ఇప్పుడు మొదలవుతుంది!” అనే ఫీలింగ్ మాత్రమే మిగుల్తుంది. కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఆ కుతూహలం మెల్లిగా తగ్గిపోవటం జరుగుతుంది.

అలాగే సోనాక్షి సిన్హా తెలుగు తెరపై పిశాచంగా కనిపించాల్సిన చోట జ్యువెలరీ షాప్ కేటలాగ్లా మెరిసి మాయమవుతుంది. పాత్రకు బ్యాక్‌స్టోరీ లేదు, భయానికి ప్రెజెన్స్ లేదు.
పిశాచం భయపెట్టకపోతే హారర్ డ్రామా ఏం చేస్తుంది? ఇక్కడ భయమూ లేదు, ఫీల్ కూడా లేదు.

అలాగే ఇలాంటి కథల్లో హీరోకి బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండాలి. కానీ శివ (సుధీర్ బాబు) పాత్రకు ఎమోషన్ లేయర్ లేకపోవడంతో ప్రేక్షకుడు అతనితో కనెక్ట్ అవ్వలేడు. రుద్రారం గ్రామం, కుటుంబ రహస్యం, పిశాచం మధ్య ఉన్న బంధం బలహీనంగా చూపించడంతో క్లైమాక్స్‌కి వచ్చే సరికి థ్రిల్ బదులు అలసట మిగిలింది.

టెక్నికల్ గా …

ప్రతి ఫ్రేమ్ చూసిన వెంటనే “సెట్‌లో షూట్ చేసారు” అని అనిపించే స్థాయి ఆర్టిఫిషియాలిటీ. బ్యాక్‌డ్రాప్ రియలిస్టిక్‌గా కాకుండా ఫాంటసీ వరల్డ్ లా కనిపిస్తుంది. ముఖ్యంగా నాసిరకం VFX సినిమా ఆత్మను పూర్తిగా చంపేసింది. ఫినిషింగ్‌లో రొటీన్ క్లైమాక్స్, సగం ఓపెన్ ఎండ్‌తో సీక్వెల్ హింట్ ఇవ్వడం — ఇది స్క్రిప్ట్ కంటే మార్కెటింగ్ మూమెంట్‌గా కనిపించింది.

సుధీర్ బాబు మాత్రం బాగానే కష్టపడ్డాడు, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ బ్లాక్‌లో అతని ఇన్‌టెన్సిటీ కనిపిస్తుంది. సోనాక్షి సిన్హా తెలుగు తెరపై ధనపిశాచిగా ఆకట్టుకోవాలి, కానీ బలహీనమైన పాత్ర రాత, ఇంపాక్ట్‌ లేని ప్రెజెంటేషన్ వల్ల ఆమె ఎంట్రీ కూడా కేవలం ఫ్లాష్‌లా మారిపోయింది.

ఫైనల్ థాట్:

“జటాధర”లో దెయ్యం లేచింది… కానీ కథ మాత్రం ఇంకా ఆవులిస్తూనే చేస్తూనే ఉంది. శివుడి తాండవం కన్నా, ఎడిటింగ్ రిథమ్ ఎక్కువ భయపెట్టింది.
పిశాచం కంటే డేంజరస్‌గా ఉన్నది — VFX!.

“ధనపిశాచి కంటే ఘోరమైంది, స్క్రిప్ట్‌పిశాచి!”

, , , , ,
You may also like
Latest Posts from ChalanaChitram.com