సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కానీ, అది హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి, డీప్‌ఫేక్ వేధింపులకు దారితీస్తే? అదే అనసూయ విషయంలో జరిగింది. సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై తన గళం వినిపించినందుకు, ఏకంగా 42 మంది ఆమెపై డిజిటల్ దాడికి దిగారు. ఇప్పుడు ఆ 42 మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంచలన వివాదం వెనుక ఉన్న కీలక మలుపులు ఇవే..

వివాదానికి బీజం..
గత డిసెంబర్లో ఒక ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ మంటకు కారణమయ్యాయి. మహిళల దుస్తుల ఎంపికే వేధింపులకు కారణమనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

గళం విప్పిన అనసూయ – చిన్మయి!
శివాజీ వ్యాఖ్యలను సింగర్ చిన్మయి, నటి అనసూయ బహిరంగంగా తప్పుబట్టారు. “బట్టలు కాదు.. చూసే కళ్లు, ఆలోచించే బుద్ధి మారాలి” అంటూ వారు చేసిన ట్వీట్లు శివాజి ఫ్యాన్స్‌కు, కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించాయి.

వ్యవస్థీకృత ‘డిజిటల్ దాడి’ ప్రారంభం!
అనసూయ స్పందించిన మరుసటి రోజు నుండే ఒక ప్లాన్ ప్రకారం ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఇది కేవలం విమర్శలతో ఆగలేదు. బూతులు, వ్యక్తిగత దూషణలు, చివరకు ఆమె కుటుంబాన్ని కూడా లాగుతూ వందలాది పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

పర్సనల్ ఫోటోల మార్ఫింగ్.. ‘డీప్‌ఫేక్’ అరాచకం!
అనసూయ తన కుటుంబంతో కలిసి వెళ్లిన హాలిడే ఫోటోలను సేకరించి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. AI (కృత్రిమ మేధ) ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి, ఆమె పరువు తీసేలా సర్క్యులేట్ చేయడం ఈ వివాదంలో అత్యంత దారుణమైన ఘట్టం.

రంగంలోకి మహిళా సంఘాలు (JAC)!
అనసూయకు మద్దతుగా మహిళా, ట్రాన్స్‌జెండర్ ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకొచ్చింది. టీవీ డిబేట్లు, యూట్యూబ్ ఇంటర్వ్యూల పేరుతో మహిళలపై జరుగుతున్న హింసను వారు తీవ్రంగా ఖండించారు.

టీఆర్పీల వేటలో ‘నీచత్వం’.. మీడియాపై మండిపాటు!
కేవలం వ్యూస్ మరియు టీఆర్పీల కోసం కొన్ని టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టడాన్ని JAC తప్పుబట్టింది. ప్యానెల్ డిస్కషన్ల పేరుతో అనసూయ క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులకు అనసూయ ఫిర్యాదు.. 42 మందిపై గురి!
అయినా అనసూయపై దాడి ఆగలేదు. దాంతో సహనం నశించిన అనసూయ, అన్ని ఆధారాలతో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధిస్తున్న 42 మంది లిస్టును, వారి సోషల్ మీడియా లింకులను పోలీసులకు సమర్పించారు.

నిందితుల జాబితాలో ప్రముఖులు!
ఈ 42 మందిలో సామాన్యులే కాదు.. కరాటే కళ్యాణి, శేఖర్ బాషా, బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి వంటి పాపులర్ పేర్లు ఉండటం షాకింగ్ అంశం. అలాగే పలు టీవీ ఛానెళ్ల యాంకర్లను కూడా నిందితులుగా చేర్చారు.

కఠిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు!
పోలీసులు నిందితులపై లైంగిక వేధింపులు (BNS 75), నేరపూరిత బెదిరింపులు (BNS 351), ఐటీ చట్టం కింద సెక్షన్ 66-E, 67లను ప్రయోగించారు. ఈ సెక్షన్ల ప్రకారం నిందితులకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

నిలిచి గెలిచిన ‘అనసూయ’.. ఒక గట్టి హెచ్చరిక!
“మహిళలు గొంతు విప్పితే అణచివేస్తాం” అనుకునే వారికి అనసూయ ఒక ఉదాహరణగా నిలిచారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య గీత దాటితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో ఈ కేసుతో నిరూపిస్తున్నారు.
ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె. రాధిక యాదవ్ నమోదు చేయగా, ఇన్ స్పెక్టర్ జి. విజయ్ కుమార్ దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. చట్ట ప్రకారం ఫిర్యాదుదారుకు ఎఫ్ఐఆర్ కాపీని ఉచితంగా అందించామని, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ కంటెంట్, సోషల్ మీడియా కార్యకలాపాలతో సహా అన్ని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇకనైనా మారేనా?
అనసూయ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం టాలీవుడ్ డిజిటల్ మీడియాలో పెను మార్పులకు నాంది పలకాలి. భావప్రకటన స్వేచ్ఛ అంటే పక్కవారిని కించపరచడం కాదని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని టీఆర్పీల కోసం తాకట్టు పెట్టకూడదని ఈ సంఘటన పాఠం నేర్పుతోంది. మరి ఈ 42 మందిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి!

