థియేటర్ల దగ్గర జాతర మొదలవ్వకముందే బాక్సాఫీస్ దగ్గర ‘దురంధర్ 2’ ఊచకోత మొదలైపోయింది. కేవలం బుకింగ్స్‌తోనే ఈ రేంజ్ బాదుడు ఉంటే, ఇక సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బాలీవుడ్ వెండితెరపై మరో భారీ సునామీ రాబోతోంది. మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘దురంధర్: ది రివెంజ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనివినీ ఎరుగని రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ సినిమా ప్రీ-సేల్స్ చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోందని స్పష్టమవుతోంది. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సెట్ చేసిన ఆల్ టైం రికార్డుల వైపు ఈ చిత్రం శరవేగంగా దూసుకుపోతోంది.

ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పర్వం ఒక రేంజ్‌లో సాగుతోంది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఏకంగా ₹33 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ, డే వన్ రెగ్యులర్ షోల ద్వారా మరో ₹16 కోట్లు ఖాతాలో వేసుకుంది. అంటే కేవలం ఇండియాలోనే రిలీజ్‌కు ముందే ₹50 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ‘దురంధర్ 2’ మేనియా మామూలుగా లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే $3 మిలియన్ల (దాదాపు ₹25 కోట్లు) బుకింగ్స్ నమోదయ్యాయి. ఓవరాల్‌గా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ ₹75 కోట్ల మార్కును దాటేసింది. బాలీవుడ్ చరిత్రలో ఒక సినిమాకు ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ బుకింగ్స్ రావడం ఇదే తొలిసారి.

రిలీజ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో, తొలిరోజే ₹100 కోట్ల ప్రీ-సేల్స్ మార్కును అందుకున్న మొదటి హిందీ చిత్రంగా ‘దురంధర్ 2’ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా యూఎస్ఏ మార్కెట్‌లో ఈ సీక్వెల్ చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ట్రేడ్ పండితుల బుర్ర పాడయ్యేలా చేస్తోంది.
ప్రస్తుతానికి బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ రికార్డ్ ₹130 కోట్లతో ‘జవాన్’ పేరిట ఉంది. కానీ, ‘దురంధర్ 2’ కి ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ వేగం చూస్తుంటే ఆ రికార్డ్ మట్టికరిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మొదటి పార్ట్ సృష్టించిన సెన్సేషన్ కి తోడు, ఇప్పుడు సీక్వెల్ పై ఉన్న అంచనాలు సినిమాను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ వేట ఎక్కడ ఆగుతుందో చూడాలి!

