స్టైలిష్ మేకింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఒక క్రేజీ డైరెక్టర్‌కు మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది, దశాబ్ద కాలం నాటి పాత బాకీ ఇప్పుడు వడ్డీతో సహా కొంపముంచే స్థాయికి చేరుకుంది! ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. గౌతమ్ వాసుదేవ్ మీనన్.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ మరియు ఆయన ప్రొడక్షన్ హౌస్ ‘ఫోటాన్ ఫ్యాక్టరీ’పై నడుస్తున్న సుదీర్ఘ ఆర్థిక వివాదంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్‌తో ఉన్న గొడవలో గౌతమ్ మీనన్‌కు భారీ జరిమానా విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా ₹4.25 కోట్ల అసలుతో పాటు , దానికి పదేళ్లకు పైగా పేరుకుపోయిన భారీ వడ్డీని కూడా కలిపి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.

ఈ వివాదం 2008లో మొదలైంది. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ , గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి భారీ అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దీంతో తమ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ సదరు నిర్మాణ సంస్థ 2013లో కోర్టును ఆశ్రయించింది. అయితే , ఆ నిధులను తాను 2012లో తీసిన ‘నీతానే ఎన్ పొన్వసంతం’ కోసం వాడానని గౌతమ్ మీనన్ వాదించారు. కానీ , కోర్టులో ఆ వాదన నిలబడలేదు.
గౌతమ్ మీనన్ చెప్పిన సినిమాకు , ఈ అడ్వాన్స్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. తాజా తీర్పు ప్రకారం , మే 2010 నుంచి ఇప్పటివరకు 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలి. అంటే అసలు ₹4.25 కోట్లు కాగా , వడ్డీతో కలిపి అది భారీ స్థాయికి చేరుకుంది. అదనంగా ₹12 లక్షల లిటిగేషన్ ఖర్చులు కూడా గౌతమ్ మీనన్ భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘ధ్రువ నక్షత్రం’ సినిమా ఆలస్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గౌతమ్ మీనన్‌కు , ఈ తీర్పు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది.

సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలు ఎంత పక్కాగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఒకప్పుడు శంకర్ , లైకా ప్రొడక్షన్స్ మధ్య జరిగిన వివాదంలాగే , ఇప్పుడు గౌతమ్ మీనన్ కేసు కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ భారీ మొత్తాన్ని చెల్లించి గౌతమ్ మీనన్ తన కెరీర్‌ను ఎలా గాడిలో పెడతారో వేచి చూడాలి. ఇన్ని చిక్కుల మధ్య ఆయన ‘ధ్రువ నక్షత్రం’ థియేటర్ల వరకు వస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!

