సినిమా వార్తలు

మంచు లక్ష్మికి ఆర్దిక కష్టాలా…అప్పులు తీర్చటం కోసమే నటిస్తోందా? షాకింగ్ నిజాలు

మంచు మోహన్ బాబు వారసురాలిగా, నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మంచు లక్ష్మి (Manchu Lakshmi) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పే లక్ష్మి, ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి, సినిమాల వల్ల వచ్చిన నష్టాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. “ఆ రోజులు అయిపోయాయి.. అప్పులు కట్టుకోవడమే సరిపోతోంది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

అప్పుల ఊబిలో మంచు లక్ష్మి?

విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దీషన్ హీరోగా నటించిన ‘బుకీ’ (Bookie) సినిమా తెలుగు ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంచు లక్ష్మి, తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఆ క్రమంలో సినిమా తీసి డబ్బులు పోగొట్టుకున్నారా? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. అది 100 శాతం నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఐదేళ్ల క్రితం తీసిన సినిమాకు సంబంధించిన అప్పులను ఇప్పటికీ కట్టుకుంటూనే ఉన్నాను” అని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు నిర్మాతగా సినిమాలు చేసిన తాను, ఇప్పుడు కేవలం యాక్టర్‌గానే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

చెక్కుల కోసం చెన్నైకి!

ఒకప్పుడు తాను చెక్కులు ఇచ్చే స్థాయి నుంచి, ఇప్పుడు తనకు చెక్కులు రావాలని కోరుకునే స్థాయికి వచ్చానని మంచు లక్ష్మి ఫన్నీగా చెబుతూనే లోతైన నిజాన్ని బయటపెట్టారు. అందుకే ప్రస్తుతం తెలుగులో కాకుండా తమిళంలో సినిమాలు చేస్తున్నానని, అక్కడైనా రెగ్యులర్‌గా చెక్కులు అందుతాయని ఆశిస్తున్నానని చెప్పారు.

తన వద్దకు ఎవరైనా కథ చెప్పడానికి వస్తే.. ముందుగా అడిగే ప్రశ్న “ప్రొడ్యూసర్ ఎవరు?” అని, నిర్మాత ఉంటేనే కథ వింటానని ఆమె నవ్వులు పూయించారు. వరుసగా సినిమాలు చేస్తూ ఆ పాత లోన్లు తీర్చడమే ప్రస్తుత తన లక్ష్యమని వెల్లడించారు.

సినిమా రంగం అంటేనే గ్లామర్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని మంచు లక్ష్మి మాటలు మరోసారి నిరూపించాయి. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా తన ఆర్థిక కష్టాలను, అప్పులను ఇంత ధైర్యంగా ఒప్పుకోవడం విశేషం. మరి మంచు లక్ష్మి త్వరలోనే ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళీ నిర్మాతగా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.

Similar Posts