సినిమా వార్తలు

రచ్చ మొదలైంది! మారుతిని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ హిట్లతో దూసుకుపోతున్న తరుణంలో, ఈ సంక్రాంతికి విడుదలైన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఊహించని షాక్ ఇచ్చింది. జనవరి 9న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్టర్ మారుతిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

సంక్రాంతి వరకు ఓపిక.. ఆ తర్వాత అసలైన రచ్చ!

నిజానికి సినిమా విడుదలైనప్పుడే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నా, సంక్రాంతి పండగ సీజన్ కావడంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించి ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ పండగ ముగియడం, సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు రావడంతో ఇప్పుడు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

ఏదీ ఆ గెటప్?:

ట్రైలర్, పోస్టర్లలో చూపించిన ప్రభాస్ అదిరిపోయే గెటప్ సినిమాలో ఎక్కడా కనిపించకపోవడంపై ఫ్యాన్స్ మారుతిని నిలదీస్తున్నారు. ఆ సీన్లు ఎందుకు కట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.

లాజిక్ లేని కథ:

సినిమాలో మైండ్ గేమ్స్ వీక్‌గా ఉన్నాయని, లాజిక్ లేని సీన్లు, పేలవమైన స్క్రీన్ ప్లే సినిమాను ముంచేశాయని మండిపడుతున్నారు.

మారుతి కామెంట్స్‌తో మరింత మంట!

ఒకవైపు ఫ్యాన్స్ కోపంగా ఉంటే, మారుతి చేసిన కామెంట్స్ “మంటపై నెయ్యి పోసినట్లు” మారాయి. “సినిమాను పండగ మూడ్‌లో చూసి డీప్ లేయర్స్ అర్థం చేసుకోలేకపోయారు” అని, “సినిమా లోతు అర్థం కావాలంటే రెండోసారి చూడాలి” అని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. “డబ్బులు ఊరికే వస్తాయా? కంటెంట్ లేని సినిమాను రెండు సార్లు చూడాలా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

టెక్నికల్ టీమ్ పై కూడా గురి..
కేవలం మారుతి మాత్రమే కాదు, తమన్ సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా లేవని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. 400 కోట్లు పెట్టి తీసిన సినిమాలో ఆ గ్రాండియర్ ఎక్కడా కనిపించలేదని, ప్రభాస్‌ను ఒక సాధారణ హీరోలా చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదైమైనా ఒకటిన్నర ఏళ్లుగా ప్రభాస్‌ను వెండితెరపై చూడాలని వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కు ‘రాజా సాబ్’ పెద్ద నిరాశనే మిగిల్చింది. మరి మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ ‘రాజా సాబ్ 2: సర్కస్ 1935’తో అయినా ఈ విమర్శలకు సమాధానం చెబుతారా? లేదా అనేది చూడాలి.

మీరేమంటారు? ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు డైరెక్టర్ మారుతే కారణమా? కింద కామెంట్ చేయండి!

Similar Posts