సినిమా వార్తలు

తలైవర్ 173 సస్పెన్స్: రజనీ కోసం కమల్ హాసన్ వేట.. ఆ యంగ్ డైరెక్టర్ కే ‘జాక్‌పాట్’ దక్కబోతుందా?

తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ దశాబ్దాల తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడంతో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద సెన్సేషన్ నమోదైంది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజనీకాంత్ 173వ సినిమా (Thalaivar 173) అఫీషియల్‌గా అనౌన్స్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మొదట ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీనియర్ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా అంతా షాక్‌కు గురయ్యారు. సుందర్ సి నిష్క్రమణకు సరైన కారణాలు వెల్లడి కానప్పటికీ కథ విషయంలో రజనీ సంతృప్తి చెందకపోవడమే ప్రధాన కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను నిర్మాతగా కమల్ హాసన్ తన భుజాన వేసుకున్నారు. తన స్టార్ రజనీకాంత్ మెచ్చే పక్కా స్క్రిప్ట్ దొరికే వరకు వేట కొనసాగిస్తూనే ఉంటానని కమల్ స్పష్టం చేయడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్రమంలో తమిళ మీడియాలో పలువురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్, నిథిలన్ స్వామినాథన్, రామ్ కుమార్ వంటి పేర్లు వినిపించినప్పటికీ తాజాగా డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మరిముత్తు పేరు రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. అశ్వత్ చెప్పిన స్క్రీన్ ప్లే రజనీకి బాగా నచ్చిందని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఒకపక్క డైరెక్టర్ వేట కొనసాగుతుండగానే రజనీకాంత్ తన తదుపరి చిత్రం జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జైలర్ 2 పనులు పూర్తయిన వెంటనే తలైవర్ 173 సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

2026 ఆరంభంలోనే ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకుడి పేరుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు దిగ్గజాలు కలిసి చేస్తున్న ఈ ప్రయోగం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Similar Posts