సినిమా వార్తలు

వద్దురా బాబోయ్ అంటే వినలేదు.. చివరకు జైలుకెళ్లాడు! రాజ్‌పాల్ యాదవ్‌పై అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ కామెడీ కింగ్ రాజ్‌పాల్ యాదవ్.. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. కానీ, ఇప్పుడు అదే నవ్వుల వెనుక పెను విషాదం దాగుంది. 9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన రాజ్‌పాల్ యాదవ్, తీహార్ జైలు ఊచలు కూడా లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. “వద్దురా బాబోయ్.. ఆ పని చేయకు” అని తాను ముందే హెచ్చరించినా రాజ్‌పాల్ వినలేదని, అందుకే ఇప్పుడు ఈ గతి పట్టిందని అక్షయ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు రాజ్‌పాల్ యాదవ్ చేసిన ఆ పెద్ద తప్పేంటి?

నటుడివి నటుడిలా ఉండు.. నిర్మాతవు కాకు!

రాజ్‌పాల్ యాదవ్ కేసు గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టారు. “రాజ్‌పాల్ కు నేను ముందే చెప్పాను.. సినిమాలు నిర్మించకు అని. మనం నటులం, మనకు నటన మాత్రమే తెలుసు. నిర్మాతగా మారడం అనేది ఒక ట్రిక్, అది మనకు తెలియదు. తక్కువ కాలంలో షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలని చూస్తే ఇలాగే ఉంటుంది” అని అక్షయ్ చురకలు అంటించారు. లెజెండరీ యాక్టర్ అస్రానీ కూడా తన చివరి రోజుల్లో సినిమాలను నిర్మించి తప్పు చేశానని బాధపడ్డారని, అదే విషయాన్ని తాను రాజ్‌పాల్ కు గుర్తు చేశానని అక్షయ్ వెల్లడించారు.

తీహార్ జైలు.. 9 కోట్ల బాగోతం!

9 కోట్ల రూపాయల అప్పు తీర్చలేక, చెక్ బౌన్స్ కావడంతో రాజ్‌పాల్ యాదవ్ ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయన తీహార్ జైల్లో శిక్ష కూడా అనుభవించారు. అయితే, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో ప్రస్తుతం ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు తాజా విచారణలో రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటికే 4.25 కోట్లు చెల్లించినట్లు ఆయన తరపు లాయర్లు వెల్లడించారు. భారీ మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో ఆయనను మళ్ళీ జైలుకు పంపే ఆలోచన లేదని కోర్టు అభిప్రాయపడింది.

భూత్ బంగ్లాలో టామ్ అండ్ జెర్రీ!

ఒకవైపు కేసులు నడుస్తున్నా, రాజ్‌పాల్ యాదవ్ వృత్తి పట్ల చూపే అంకితభావాన్ని అక్షయ్ కొనియాడారు. “రాజ్‌పాల్ 100 శాతం ఇవ్వాల్సిన చోట 140 శాతం ఎనర్జీ ఇస్తాడు. ఆయనతో పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం” అని అక్షయ్ అన్నారు. వీరిద్దరూ కలిసి 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘భూత్ బంగ్లా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 10, 2026న విడుదలకు సిద్ధమవుతోంది.

త్వరలోనే రాజ్‌పాల్ యాదవ్ ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలని అక్షయ్ ఆకాంక్షించారు. నటులుగా ఉండి నిర్మాతలై చేతులు కాల్చుకున్న వారి జాబితాలో రాజ్‌పాల్ యాదవ్ ఒక ఉదాహరణగా నిలిచారు.

Similar Posts