సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ అంటేనే కోలీవుడ్‌కు కొద్ది నెలల క్రితం ఓ స్థాయిలో క్రేజ్. ‘జిగర్తాండా’ వంటి డిఫరెంట్ సినిమాతో కార్తిక్ సుబ్బరాజ్ కు వచ్చిన క్రేజ్, ‘సూరరై పోట్రు’ తర్వాత సూర్య మీద ఉన్న అదిరిపోయే ఇమేజ్ ఈ ‘రెట్రో’ సినిమాపై భారీ అంచనాలు తెచ్చాయి.
పీరియడ్ బ్యాక్‌డ్రాప్, మాస్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అన్న హైబ్రిడ్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా, ట్రైలర్ సమయంలో బోలెడంత హైప్‌ను క్రియేట్ చేసింది. కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.
థియేటర్లలో డిజాస్టర్, ఓటీటీలో నిశ్శబ్దం
2 గంటల 48 నిమిషాల నిడివి, స్లో నేరేషన్, బాగా క్లారిటీ లేని స్క్రీన్‌ప్లే – ఇవే సినిమా రిజల్ట్‌ను ఇబ్బందిగా మార్చాయి.
అర్దం పర్దం లేని కథ, అనేక పండని సీన్స్, బలహీనమైన ఎమోషనల్ కనెక్టవిటీ సినిమాను ఆడియెన్స్ పట్ల చాలా దూరంగా ఉంచాయి.
థియేటర్లలో డిజాస్టర్ అయ్యిన ఈ సినిమా, ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ ప్రారంభమైనా… పెద్దగా సౌండ్ చేయలేకపోయింది.
ఇప్పుడు అదే సినిమాను వెబ్ సిరీస్‌గా తీసుకురావడమేనా సొల్యూషన్?
తాజాగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,
“రెట్రో ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను ఓటీటీలో వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో తీసుకురావాలని చర్చలు చేస్తున్నాం. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివితో, హాస్యం, ప్రేమ, యాక్షన్ ఇలా ఒక్కో ఎమోషన్ మీద ఫోకస్ చేయాలని భావిస్తున్నాం” అని అన్నారు.
అయితే, ఇక్కడే అసలు ప్రశ్న –
థియేటర్లో కూడా ఆదరణ లేకపోయిన కంటెంట్‌ను ఎక్స్‌టెండెడ్ వెర్షన్ పేరిట మరింత లెంగ్త్‌గా, ఇంకొన్ని సన్నివేశాలు కలిపి ప్రజెంట్ చేస్తే, అది ప్రేక్షకులకు నిజంగా అవసరమా?
ఇప్పటికే ఓటీటీలో కూడా ‘రెట్రో’కి స్పందన కలిసొచ్చే స్థాయిలో లేదు. అలాంటప్పుడు అదే కంటెంట్‌ను మళ్ళీ ‘సిరీస్’గా తీసుకురావడం చూసి..”ఒక డిజాస్టర్‌ను మల్టీపార్ట్‌గా చూపిస్తే మెరుగవుతుందా?” అనే ప్రశ్న నెటిజన్ల నుంచి గట్టిగా వినిపిస్తోంది.
నిర్ణయం సాహసమే కానీ, ఫలితం?!
సిరీస్ ఫార్మాట్‌లో ప్రెజెంటేషన్ ఒక్కటే ఓ సినిమాని హిట్ చేయదని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేరేషన్ బలహీనంగా ఉన్నప్పుడు.. ఎక్కువ సీన్స్‌తో అది గట్టి ప్రవాహం అవుతుందనుకోవడం ఓ తప్పుదారి కావచ్చు.
కాబట్టి, రెట్రో సిరీస్ బాగా ఉంటుందో లేదో అన్నది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ, ఓటిటిలోనే ఫ్లాప్ అయిన చిత్రాన్ని మళ్ళీ మరో ఫార్మాట్‌లో చూపించాలనుకోవడం సాహసమే, మార్కెట్ వైపు చూసినా వ్యాపారబద్ధమైన నిర్ణయం కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఏదైమైనా ఒక సినిమా మీద ప్రేమ వేరే విషయం… దానిని ప్రేక్షకులు అభ్యర్థించారా అనే విషయాన్ని లెక్కచేయకపోతే, అదే ప్రేమ.. అహంభావంగా మారే ప్రమాదం ఉంటుంది.
రెట్రో సిరీస్ ఆలోచన కూడా అలాంటి ఓ సాహసమే!