కేరళలో ఉద్యోగం చేస్తున్నప్పుడు గౌతమ్ (శర్వానంద్), నిత్యలు ఒకరినొకరు ఇష్టపడతారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, నిత్య తన ప్రేమ విషయం తండ్రి ( సంపత్) కు చెబుతుంది.ప్రముఖ లాయర్ అయిన సంపత్ మొదట పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ గౌతమ్ ఇంటికి వెళ్ళాక తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు.
దానికి కారణం గౌతమ్ తండ్రి (నరేష్). 60 ఏళ్ల వయసులో ఆయన తనకంటే 30 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని (సిరి హన్మంతు) రెండో పెళ్లి చేసుకుంటాడు. అంతేకాకుండా, ఆ వయసులో ఆయన తండ్రి కాబోతున్నాడనే విషయం నిత్య తండ్రికి అస్సలు నచ్చదు. ఇలాంటి కుటంబం తో పెళ్లిని తన చుట్టాల మధ్య ఘనంగా పెళ్లి చేస్తే తన పరువు పోతుందని భావిస్తాడు సంపత్. దాంతో రిజిస్ట్రార్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాడు.
ఈ క్రమంలో పెళ్లి తేదీ ఖరారు చేసుకోవడానికి గౌతమ్, నిత్యలు రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తారు. అక్కడ రిజిస్ట్రార్ సత్యమూర్తి (సునీల్)ని చూడగానే గౌతమ్‌కు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే, కొన్ని ఏళ్ల క్రితం కాలేజీ రోజుల్లో దియా (సంయుక్త) తో గౌతమ్ చేసుకున్న సీక్రెట్ పెళ్లికి సాక్షి ఈ సత్యమూర్తే! ఆ తర్వాత ఏమైంది, గౌతమ్,నిత్యల పెళ్లి అయ్యిందా, అసలు దియాతో ఎందుకు గౌతమ్ విడిపోయాడు, సత్యమూర్తిని ఎలా మేనేజ్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘నారి నారి నడుమ మురారి’ పై అంచనాలు మొదటినుంచే ఎక్కువగా ఉన్నాయి. కారణం ‘సామజవరగమనా’ వంటి సూపర్ హిట్ మాత్రమే కాకపోవటం. అలాగే ఆ సినిమాలో భావోద్వేగాల్ని, సామాజిక సంక్లిష్టతలను హ్యూమర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలో రామ్ అబ్బరాజు చూపించాడు. అదే డీఎన్‌ఏ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఓపెనింగ్ నుంచే టోన్ ఫిక్స్ – “ఇది హిలేరియస్ ఎంటర్టైనర్”. మొదటి సీన్ నుంచే దర్శకుడు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తాడు: ఇది సీరియస్ డ్రామా కాదు. ఇది రేసీ కామెడీ నారేటివ్.
ఫస్ట్ హాఫ్ మొత్తం వేగంగా సాగుతుంది. సీన్స్ చిన్నవి, జోక్స్ పంచ్ ఉన్నవి, ట్రాన్సిషన్స్ స్మూత్‌గా ఉంటాయి. ప్రేక్షకుడికి “తరువాత ఏం జరుగుతుంది?” అన్న కుతూహలం కంటే, “ఇంకా ఎలాంటి సీన్ వస్తుంది?” అన్న ఆసక్తినే పెంచేలా స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. ముఖ్యంగా డబుల్ రిలేషన్‌షిప్ డిజైన్ – హీరో ప్రేమ కాదు… ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్. సాధారణ లవ్ స్టోరీలా కాకుండా, రామ్ అబ్బరాజు రెండు ట్రాక్‌లను ఒకేసారి నడిపిస్తాడు.
శర్వానంద్ – సాక్షి లవ్ ట్రాక్, శర్వానంద్ తండ్రి నరేష్ – సాక్షి తండ్రి సంపత్ రాజ్ మధ్య ఫ్యామిలీ డైనమిక్స్. ఇక్కడ కథ హీరో ప్రేమ మీద మాత్రమే నిలబడదు. తండ్రుల మధ్య ఏర్పడే కాన్ఫ్లిక్ట్, తరం తరం మధ్య విలువల తేడా ఇవే కథను నడిపిస్తాయి. ఇది స్క్రిప్ట్‌కు కొత్త యాంగిల్ ఇస్తుంది. ప్రేమ కథ వ్యక్తిగతం అయితే, తండ్రుల గొడవ సామాజికం అవుతుంది. ఏదైమైనా “నారి నారి నడుమ మురారి” స్క్రిప్ట్ బేస్ ఫిల్మ్. డైలాగులు, స్క్రీన్ ప్లే , ఎంటర్టన్మెంట్ కలిసి సినిమాని పరుగెత్తించాయి.
టెక్నికల్ గా…
స్క్రిప్టు పరంగా .. ఫస్ట్ హాఫ్ స్పీడుగా సాగుతుండగా, సెకండ్ హాఫ్‌లో పేస్ కొద్దిగా తగ్గుతుంది. అయినా కూడా హ్యూమర్ ఎక్కడా తగ్గదు కాబట్టి అది పెద్దగా ఇబ్బంది పెట్టదు.ఇక పాటలకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. రెండు పాటలు బాగున్నప్పటికీ, వాటి ప్లేస్‌మెంట్ వల్ల సినిమా ఫ్రీ ఫ్లోకి కొద్దిగా అడ్డంకి ఏర్పడినట్టు అనిపిస్తుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు అదనపు బలం చేకూర్చింది.
సినిమాటోగ్రఫీ విషయంలో జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్‌లు సినిమాను రంగులమయంగా, కళ్లకు హాయిగా తీర్చిదిద్దారు. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉండి ఫస్ట్ హాఫ్‌ను స్పీడుగా నడిపించింది. అయితే సెకండ్ హాఫ్‌లో కొన్నిచోట్ల లాగ్ కనిపిస్తుంది, కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ సినిమా కొద్దిగా లాగినట్టు అనిపిస్తుంది. నందు రాసిన డైలాగులు సందర్భానుసారంగా ఉండి చాలా హాస్యంగా ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు కూడా గొప్పగా ఉన్నాయి.
రామ్ అబ్బరాజు తన టీమ్ నుండి కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకోవడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకి పెట్టింది పేరైన శర్వానంద్, ఈ మధ్య కాలంలో వరుసగా విభిన్న ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నారు. కానీ, ఈసారి తనకి అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే నమ్ముకుని, సీనియర్ నటుడు నరేష్‌తో కలిసి ప్రేక్షకులను తన మాయాజాలంలో పడేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాకు ప్రాణం పోసి, ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని అందించింది.
చూడచ్చా
సంక్రాంతికి ఫ్యామిలీలతో వెళ్లి చూడదగ్గ ఎంటర్టైనర్

