సినిమా వార్తలు

బుక్ మై షో ద్వారా నెగిటివ్ ప్రచారం, ముప్పై వేలు ఖర్చు పెట్టి కుట్ర?

హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ఈషా’ పై కావాలని కొందరు కుట్ర పూర్వకంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బుక్ మై షో రేటింగ్స్‌ను కావాలని తగ్గిస్తున్నారని నిర్మాత బన్నీ వాసు మీడియా సమావేశంలో అన్నారు.

ప్రీమియర్ షో వేస్తే కొందరు ఒకేసారి 200 నుంచి 300 టిక్కెట్లు బుక్ చేసుకుని, షో అయిపోయిన వెంటనే అందరూ కలిసి ఒకే రేటింగ్ ఇస్తారని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల బుక్ మై షోలో సినిమా రేటింగ్ ఒక్కసారిగా పడిపోతుందని, దాంతో థియేటర్‌కు రావాలనుకునే ప్రేక్షకుడు వెనక్కి తగ్గుతాడని చెప్పారు. రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేసి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, ప్రేక్షకులు మాత్రం రేటింగ్స్ కాకుండా సినిమా చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇలాంటి పరిస్థితులు తనకు గతంలో కూడా ఎదురయ్యాయని, ఇప్పుడు ‘ఈషా’ నిర్మాతలు అదే పరిస్థితిలో ఉన్నారని అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి కూడా ఇదే విషయంపై తీవ్రంగా స్పందించారు. కొందరు సినిమాను చూడకుండానే ఫేక్ నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారని ఆయన అన్నారు. ఇంకా సినిమా అమెరికాలో విడుదల కాకముందే అక్కడి నుంచి నెగిటివ్ రిపోర్ట్ రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆ రివ్యూ రాసిన వ్యక్తిని అడిగితే, పరిశ్రమలో ఎవరో చెప్పారని సమాధానం ఇచ్చాడని తెలిపారు. ఎవరో చెప్పిన మాటలతోనే పేరాల కొద్దీ నెగిటివ్‌గా రాయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రీమియర్ షోలు వేసిన థియేటర్లు నిండిపోయాయని, సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని చెబుతున్నారని చెప్పారు.

మరో నిర్మాత దామోదర్ ప్రసాద్ కూడా నెగిటివ్ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లలో కంప్యూటర్లు పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరి సినిమాను వారు ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదని, కానీ ఇతరుల సినిమాలను దెబ్బతీయడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇలాంటి పనులు చేసే వాళ్లకు పరిశ్రమలో భవిష్యత్ ఉండదని హెచ్చరించారు.

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఈషా’ను శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్ నిర్మించారు. సోషల్ మీడియా రేటింగ్స్ కంటే ప్రేక్షకుల నిజమైన స్పందనకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతలు స్పష్టంగా చెబుతున్నారు.

Similar Posts