ఇండస్ట్రీలో పద్ధతిగా ఉంటూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయే సమంత, ఒక్కసారిగా గళం విప్పింది. ఆడవాళ్లంటే కేవలం సర్దుకుపోయే తత్వమున్న వారు మాత్రమే కాదు, తమకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్నవారని కుండబద్దలు కొట్టింది. హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్’ ఈవెంట్‌లో సామ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆమె చేసిన విశ్లేషణ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
సారీలు ఆపండి.. కాన్ఫిడెన్స్ పెంచండి!
మహిళలు ప్రతి చిన్న విషయానికీ ‘సారీ’ చెప్పడం ఒక అలవాటుగా మార్చుకున్నారని, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని సమంత ఘాటుగా విమర్శించింది. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా క్షమాపణలు చెబుతుంటారని, ఆ అవసరం లేకపోయినా ఎందుకు వంగి ఉండాలని ఆమె ప్రశ్నించింది. ఇకనైనా ఆ ‘సారీ’ల పర్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చింది.

హీరోల కోసం కాదు.. మీ కోసం నటించండి!
సినిమాల్లో మహిళా పాత్రలు కేవలం హీరోలకు సపోర్టింగ్‌గా ఉండటమో, లేక ఎవరికో ఒకరికి భార్యగానో పరిమితం కాకూడదని సామ్ తేల్చి చెప్పింది. “హీరోల పక్కన కేవలం గ్లామర్ బొమ్మల్లా ఉండటం కాదు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చేయాలి” అంటూ మేకర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. భవిష్యత్తులో ‘ఫీమేల్ లీడ్’ అనే ట్యాగ్ లేకుండా, కథలో భాగంగానే మహిళా పాత్రలు బలంగా ఉండాలని ఆకాంక్షించింది.
సక్సెస్‌ను ఓన్ చేసుకోండి.. గర్వంగా చెప్పండి!
మహిళలు తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి మొహమాట పడకూడదని సమంత సూచించింది. ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని తక్కువ చేసుకోకుండా, గర్వంగా ‘థాంక్యూ’ చెప్పడం నేర్చుకోవాలంది. అంబిషన్ ఉండటం తప్పు కాదని, ప్రతి మహిళా తనకంటూ ఒక గోల్ పెట్టుకుని ముందుకు దూసుకుపోవాలని స్పష్టం చేసింది.
సెట్స్‌లో సేఫ్టీ ఉందా? సామ్ సూటి ప్రశ్న!
సినిమా షూటింగ్ సెట్లలో మహిళా నటుల భద్రత గురించి సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. భద్రత అనేది ఏదో ఒక రోజు చర్చించి వదిలేసే అంశం కాదని, ప్రతిరోజూ పాటించాల్సిన కనీస నియమమని గుర్తు చేసింది. ప్రతి నటి సెట్‌లో సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో పనిచేసినప్పుడే నిజమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

