సినిమా హిట్ అయితే హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని తాకుతాయి.. కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయితే కనీసం వారు తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి రాదని బాలీవుడ్ లేటెస్ట్ మూవీ “తు మేరి మై తేరా మై తేరా తు మేరి” ప్రూవ్ చేసింది. యువ హీరో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత దారుణంగా దెబ్బతిన్నదంటే.. ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి!
ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు చూస్తే ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కనీసం హీరో పారితోషికం కూడా రికవరీ కాలేదు. ఈ సినిమా కోసం కార్తీక్ ఆర్యన్ ఏకంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేశారని సమాచారం.
మొదటి వారం కలెక్షన్లు: బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇండియా వైడ్ గా కేవలం 28 కోట్లు మాత్రమే రాబట్టింది.
అంటే, హీరో తన ఇంటికి తీసుకెళ్ళిన డబ్బులో సగం కూడా ఈ సినిమా థియేటర్ల నుంచి వెనక్కి తీసుకురాలేకపోయింది. దీనికి పబ్లిసిటీ, ఇతర ఖర్చులు కలుపుకుంటే నిర్మాతలకు మిగిలింది కేవలం ‘గుండు సున్నా’ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
అనన్య పాండే ‘ప్లాప్’ సెంటిమెంట్!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు ఈ సినిమాతో పెద్ద షాకే తగిలింది. గతేడాది విడుదలైన తన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో, ఈ క్రిస్మస్ రిలీజ్ మీద ఆమె గంపెడు ఆశలు పెట్టుకుంది. కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరో సరసన నటిస్తే హిట్ గ్యారెంటీ అనుకుంది. కానీ, కథలో దమ్ము లేకపోవడంతో కార్తీక్ క్రేజ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. అనన్య ఖాతాలో మరో బిగ్ డిజాస్టర్ పడిపోయింది.
నిర్మాతలకు భారీ నష్టాలు.. షేక్ అవుతున్న బాలీవుడ్!
వరుస ప్లాపులతో సతమతమవుతున్న జాన్వీ కపూర్, అనన్య పాండే లాంటి స్టార్ కిడ్స్ కు బాక్సాఫీస్ దగ్గర అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. కేవలం హీరోల మీద కోట్లు కుమ్మరిస్తే సరిపోదని, కంటెంట్ ఉంటేనే జనం వస్తారని ఈ సినిమా రిజల్ట్ మరోసారి నిరూపించింది. 50 కోట్లు తీసుకున్న కార్తీక్ పరువు కూడా ఈ సినిమాతో గంగలో కలిసినట్లయింది.

