
AI విప్లవంపై సిరివెన్నెల గారు అప్పట్లోనే స్ట్రాంగ్ కౌంటర్!
నేటి ఆధునిక యుగంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) పేరుతో మనిషి సాధిస్తున్న సాంకేతిక విప్లవంపై దివంగత ప్రముఖ గేయ రచయిత, పండితుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అప్పట్లోనే షాకింగ్ విశ్లేషణ చేశారు. మనం ప్రగతి అనుకుంటున్నది నిజానికి పతనమా? అనే కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
“నేను ఆలోచించను.. నా తరపున నువ్వు ఆలోచించు!”
మనిషి తన సొంత తెలివితేటలతో (Original Intelligence) కృత్రిమ తెలివితేటలను (AI) కనిపెట్టడంపై సిరివెన్నెల ఘాటుగా స్పందించారు. “నీ ఒరిజినల్ తెలివితేటలను వాడి AIని కనిపెట్టావు అంటే.. దాని అర్థం ‘నేను ఆలోచించను, నా తరపున నువ్వు ఆలోచించు’ అని బాధ్యతను వదిలేసుకోవడమే కదా?” అని ఆయన ప్రశ్నించారు. ఇది మనిషి సాధించిన విజయమా లేక ఆలోచనా శక్తిని కోల్పోతున్న నిస్సహాయతా? అని నిలదీశారు.
జంతువు కంటే హీనమైన స్థితి?
మనిషి తన ప్రాథమిక జీవ లక్షణాలైన ఆహారం, నిద్ర, భయం, మైథునం వంటి వాటిని AIకి అప్పగించలేడని శాస్త్రి గారు గుర్తు చేశారు.
“నీ తరపున AIని భోజనం చేయమనో, నిద్రపోమనో చెప్పలేవు కదా? అంటే నీ ప్రాథమిక జాంతవ స్థితిని (జంతు లక్షణాలను) నువ్వు మార్చుకోలేవు. అక్కడి నుండి ఉన్నత స్థితికి వెళ్లాల్సింది పోయి, ఇంకా కిందకి దిగిపోతున్నావు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే.. నిన్ను జంతువు అనడానికి కూడా వీల్లేని పరిస్థితి. నీకంటే జంతువే నయం!” అంటూ ఆయన విసిరిన చురకలు ప్రతి మనిషిని ఆలోచనలో పడేస్తున్నాయి.
సిరివెన్నెల అడిగిన అసలు ప్రశ్న ఇదే:
వందల వేల ఏళ్ల మానవ పరిణామ క్రమంలో మనిషి సాధించింది సిగ్గుపడాల్సిన విషయమా? మనిషి తన సొంత మెదడుకు పని చెప్పకుండా యంత్రాలపై ఆధారపడటాన్ని ప్రగతిగా ఎలా చెప్పుకుంటాడు?
ఈ రోజు మనం వాడే చాట్ బాట్లు, AI టూల్స్ మనల్ని తెలివైన వారిగా చేస్తున్నాయా లేక బద్ధకస్తులుగా, నిస్సహాయులుగా మారుస్తున్నాయా? అనే చర్చకు ఈ కామెంట్స్ వేదిక అయ్యాయి.
