పేరుకి జమీందారు గారి మనవడు అయినా రాజు (నవీన్ పోలిశెట్టి)కు రూపాయికు డింకీలు కొట్టే పరిస్దితి. తమకు లేదు అనే విషయం చెప్పుకోలేక ఆడంబారలను కంటిన్యూ చేయలేక, మళ్లీ అలాంటి రోజులు తిరిగి రాబోతాయా అని పగటి కలలు కంటూంటారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా..ఎంత మేనేజ్ చేసినా ఓ చోట అతనికి తీరని అవమానం ఎదురౌతుంది. అప్పుడు గొప్పగా పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. అయితే ఆ ఛాలెంజ్ ని తీర్చుకోవటానికి ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ లేదు. అయితే ఈ లోగా తన బంధువుల్లో ఒకరు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకున్నారని తెలుస్తుంది. దాంతో తనూ అదే దారిలో వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. ప్రయత్నాలు మొదలెడతాడు. కొన్ని ఫెయిల్ అవుతాయి.
ఈ లోగా ప్రక్క ఊరి కోటిశ్వరుడు భూపతి రాజు (రావు రమేశ్) ఒక్కగానొక్క కూతురు చారులత (మీనాక్షి చౌదరి) ను ఈ క్రమంలో చూస్తాడు. ఆమెను చేసుకుంటే బెస్ట్ అని ఫిక్స్ అయ్యి ఆపరేషన్ చారులత పోగ్రామ్ మొదలెట్టి రకరకాలుగా ఆమెను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తాడు. అవి ఫలించి కొన్నాళ్లకి ఆమెతో పెళ్లి అవుతుంది. ఇంక ఆ కోటీశ్వరుడు ఆస్తి తనదే అని పిచ్చ హ్యాపీ ఫీలయ్యే సమయంలోమామగారు ఓ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో అతని పగటి కలలకు హఠాత్తుగా బ్రేక్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి..దాన్నుంచి కోలుకున్న రాజు ఏం చేసాడు. చివరకు ఈ పెళ్లి కథ ఎలా సుఖాంతమైంది. ఈ క్రమంలో ఆ ఊరికి జరిగిన మేలు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
కథగా చూస్తే ఇది అనగనగా అని చెప్పుకునే రోజులు నాటి కథ. ఎక్కడా కొత్త అనేది కాగడా వేసి వెతికినా కనపడదు. చాలా ప్రెడిక్టుబుల్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ లో పెద్ద కోటీశ్వరుడు భావించిన మావగారు నిండా అప్పుల్లో మునిగిపోవడం పెద్ద ట్విస్ట్ అయితే… జమీందారు మనవడిని చేసుకుంటున్నామని భావించిన భూపతిరాజు… రాజు ..ఏమీ లేని బికారి వాడు కావడం మరో ట్విస్ట్..ఇదే ఈ సినిమా పాయింట్. అయితే ఆ తర్వాత రాజు ఆ కష్టాల నుంచి బయిటపడే ప్రాసెస్ లో ఏం చేసాడన్నది అసలు కథ.
కానీ ఆ కథను డీల్ చేయటంలోనే దర్శకుడు తడబడ్డాడు. ఫస్టాఫ్ కు సంభందం లేని విధంగా ఎలక్షన్స్ అంటూ ఓ పొలిటికల్ డ్రామా కు తెరతీసాడు. ఆ విలేజ్ ఎపిసోడ్స్ మనకు నాని పిల్ల జమీందార్ ని గుర్తు చేస్తే…ఎలక్షన్ ఎపిసోడ్స్ ..తమిళ సినిమా మండేలాని జ్ఞాపకం చేస్తాయి. ఇలా కథ,కథనం ఎంత పాదది అయినా ప్లస్ ఏమిటింటే నవీన్ పోలిశెట్టి వన్ లైనర్స్. అవి సినిమా నిండా పుష్కలంగా ఉన్నాయి.
సినిమా మొదటి భాగం పూర్తిగా సింపుల్ సెటప్ + సిట్యుయేషనల్ కామెడీ మీద నడిపారు. కథలో ఎలాంటి కాంప్లిక్ట్స్ బలంగా లేకుండా చూసుకున్నారు. అంటే ముడి బలంగా వేస్తే విడతీయటానికి కష్టపడాలి అని అన్నట్లుగా అన్నమాట. ప్రధానంగా హీరో క్యారెక్టర్ చుట్టూనే సంఘటనలు డిజైన్ చేసారు. ఫస్టాఫ్ బాగానే లాగారు కానీ సెకండ్ హాఫ్‌లో కథ దిశ పూర్తిగా మారిపోయింది.
అకస్మాత్తుగా సినిమా ఒక పాలిటికల్ క్యాంపెయిన్ డ్రామాగా మారిపోతుంది. కొన్ని సన్నివేశాలు మాత్రమే వర్క్ అవుతాయి – ముఖ్యంగా ‘దీపం’ సింబల్ కోసం ప్రచారం చేస్తూ రాజు ముఖాన్ని RIP పోస్టర్లా ప్రింట్ చేయడం వంటి సీన్లు విజువల్ కామెడీగా క్లిక్ అవుతాయి. కానీ మొత్తం ఎలక్షన్ ట్రాక్‌లోకి వెళ్లాక స్క్రీన్‌ప్లే రిపిటేటివ్‌గా మారిపోతుంది. సంఘటనలు కొత్తదనం లేకుండా ఒకే ప్యాటర్న్‌లో తిరుగుతాయి, దాంతో నేరేషన్ డల్ అవుతుంది.
ఇక్కడ ప్రధాన లోపం లాజిక్ లేయర్. “రెండు తెలుగు రాష్ట్రాలు” అన్నంత పెద్ద స్కేల్‌ని చూపిస్తూ, అంతా ఒక చిన్న గ్రామ అధ్యక్షుడి ఎలక్షన్ చుట్టూ తిరుగుతుండటం నమ్మకం కలిగించదు. మీడియా లైవ్ కవరేజ్, భారీ హడావిడి – ఇవన్నీ కథలోని రియాలిటీని బలహీనపరుస్తాయి. అయితే నవీన్ పోలిశెట్టి సినిమాల్లో లాజిక్ కంటే గ్యాగ్నే ప్రధాన ఆయుధం అన్నది తెలిసిందే. కానీ ఈసారి గ్యాగ్ల్లో కూడా కొత్తదనం కనిపించదు. రీసైకిల్ అయిన ఐడియాల వల్ల హ్యూమర్ స్థాయి “పాసబుల్” దాటదు.
టెక్నికల్ గా…
నవీన్ పోలిశెట్టి “వన్ మాన్ షో”గా సినిమాను ముందుకు నడిపిస్తాడు. ప్రతి సన్నివేశం పంచ్‌లైన్ మీదే నిలబడుతుంది. మీనాక్షి చౌదరి తన పాత్రలో డీసెంట్‌గా పనిచేసింది; సపోర్టింగ్ క్యాస్ట్ అవసరమైనంత వరకు సరిపోతారు కానీ కథను ఎలివేట్ చేసే స్థాయిలో మాత్రం కాదు. మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ ఆల్బమ్ ఒకటి రెండు మాత్రమే ప్రత్యేకంగా గుర్తుండేలా ఉంటుంది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ ని కొంత ట్రిమ్ చేయచ్చు అనిపిస్తుంది.
ఫైనల్ గా..
కొన్ని ఫన్నీ వన్-లైనర్లు, అప్పుడప్పుడు బాగా నవ్వించే సీన్స్ ఉన్నాయి. టైమ్ పాస్ ఎంటర్టైనర్గా ఒకసారి చూడొచ్చు గానీ, కొత్తదనం మాత్రం ఏమీ ఇవ్వదు. పండగకు ఓ లుక్కేయచ్చు.

