పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతి కానుక ముందే వచ్చేసింది! తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ తో చేతులు కలిపింది. భోగి పండుగ సాక్షిగా నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌తో పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

కేవలం సినిమాలు మాత్రమే కాదు, కంటెంట్ ఉన్న విభిన్నమైన ప్రాజెక్ట్‌లను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒక్కటయ్యారు. “మంచి సినిమాలను అందించే అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ పవన్ గారు” అంటూ విశ్వప్రసాద్ తన ఆనందాన్ని పంచుకున్నారు. త్వరలోనే ఈ కాంబో నుండి భారీ ప్రకటనలు రాబోతున్నాయి!

పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ స్పందిస్తూ.. ‘భోగి శుభ సందర్భంగా కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు’ అని తెలిపింది.

‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ట్వీట్ కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ బదులిస్తూ, ‘కథలపై చర్చించడానికి మాకు అవకాశం కల్పించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మాకు ఎంతో విలువైనది. ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్‌ను అందించేందుకు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాము. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ అద్భుత ప్రయాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

#Pawan Kalyan, #PawanKalyanCreativeWorks, #People Media Factory, #TG Vishwa Prasad, #Tollywood

By admin