సినిమా సమీక్షలు

గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీ రివ్యూ

చైత్ర(సారా అర్జున్) కి ఐఎఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది కల. అందుకోసం కష్టపడుతూంటుంది. అయితే ఒకరోజు మధ్యాహ్నం స్నేహితురాలి పిలిచిందని ‘ఆంబ్రోసియా’ అనే పబ్‌లో జరుగుతున్న ‘యుఫోరియా’ ఈవెంట్‌కి వెళుతుంది. అక్కడ ఆ ప్రెండ్ ద్వారా ఐదుగురు కుర్రాళ్లు పరిచయమవుతారు. వాళ్లు ఆ పార్టీ తర్వాత చైత్రను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి బయల్దేరతారు. అయితే దారిలో ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఆమెను దారుణంగా రేప్ చేస్తారు.

ఇక ఈ రేప్ చేసిన వాళ్లలో ఒకరు వికాస్ (విఘ్నేష్ గ‌విరెడ్డి). అతని త‌ల్లి వింధ్య వేముల‌ప‌ల్లి (భూమిక) పెద్ద పేరున్న విద్యావేత్త‌. ఆమె తన కొడుకే ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడని తట్టుకోలేకపోతుంది. తన కొడుకు కన్నా ఆడపిల్లకు జరిగిన అన్యాయమే ఆమెను కలిచి వేస్తుంది. వెంటనే ఓ డెసిషన్ తీసుకుంటుంది. బాధితురాలి ప‌క్షాన నిలవటానికి నిర్ణయం తీసుకుంటుంది.

మరో ప్రక్క పోలీస్ అధికారి జ‌య‌దేవ్ నాయ‌ర్ (గౌత‌మ్ మీన‌న్) రంగంలోకి దిగి కేసు ద‌ర్యాప్తు చేప‌డ‌తాడు. అప్పుడేం జరుగుతుంది. దోషుల‌కు శిక్ష పడేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. జైలుకు వెళ్ళాక ఆ మైన‌ర్ నేర‌స్థులు ఏం చేసారు?అక్కడ డ్రగ్ ప్రపంచం వాళ్లకు ఎలా పరిచయం అయ్యింది? చివరకు ఏమైంది అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేషణ

దర్శకుడు గుణశేఖర్ ‘యుఫోరియా’తో ఒక బర్నింగ్ టాపిక్‌ను టచ్ చేశారనేది నిజం. జుబ్లీహిల్స్ ఘటన వంటి వాస్తవ ఉదంతాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన చూపిన సాహసం మెచ్చుకోదగ్గదే. అయితే, ఒక సినిమాగా ఇది ఎంతవరకు మెప్పించింది?లేదనే చెప్పాలి.

వాస్తవానికి సినిమా స్టార్టింగ్ చాలా ప్రామిసింగ్‌గా ఉంటుంది. వికాస్ గ్యాంగ్ విచ్చలవిడితనం, భూమిక కోర్టు మెట్లు ఎక్కడం వంటి సీన్లు ప్రేక్షకుడిలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతాయి. ఆ తర్వాత చైత్ర (సారా అర్జున్) తన తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని వివరించే సీన్ ఈ సినిమాకే ఆత్మ. ఆ ఎమోషన్ ప్రతి ప్రేక్షకుడినీ కదిలిస్తుంది. ఇక గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో సాగే క్రైమ్ సీన్ రీ-క్రియేషన్, పోక్సో చట్టం పవర్ చూపించడం వంటివి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.

అయితే పోక్సో చట్టం ద్వారా నిందితులకు శిక్ష పడటంతో ఇంటర్వెల్ కల్లా కథ ఒక లాజికల్ ముగింపుకు వచ్చేస్తుంది. ఇక్కడే ప్రేక్షకుడు మానసికంగా సాటిస్ఫై అయిపోతాడు. ఆ తర్వాత వచ్చే సెకండాఫ్ అంతా ఒక ‘ఎక్స్‌టెన్షన్’ లా అనిపిస్తుందే తప్ప, కథలో భాగంగా అనిపించదు.

వాస్తవానికి తన కొడుకును జైలుకు పంపిన తల్లి వేదన, ఆ కొడుకులో వచ్చే మార్పు.. ఇది ప్యూర్ ఎమోషనల్ డ్రామా. కానీ సెకండాఫ్‌లో దర్శకుడు ఈ ఎమోషన్‌ను పక్కన పెట్టి, సడన్‌గా ‘ఆపరేషన్ యుఫోరియా’ అంటూ డ్రగ్ మాఫియా ట్రాక్‌లోకి వెళ్లారు. దీనివల్ల కథ తన ఫోకస్ కోల్పోయింది.

సినిమానా? డాక్యుమెంటరీనా?:

వాస్తవ ఘటనలను సినిమాగా తీస్తున్నప్పుడు దానికి కొంత డ్రామా జోడించాలి. కానీ ఇందులో చాలా సీన్లు వార్తల్లో చదివిన విషయాలను యథాతథంగా చూపిస్తున్నట్లు ఉన్నాయి. దీనివల్ల డ్రామా పండాల్సిన చోట డాక్యుమెంటరీ ఫీలింగ్ వచ్చేస్తుంది.

టెక్నికల్ గా …

రేప్ కు గురైన కథకు కీలక పాత్రలో చేసి నసారా అర్జున్ బాగా చేసింది. నిందితుడి తల్లిగా భూమిక ఫైరఫెక్ట్, గౌతమ్ మీనన్ స్టైల్ అదిరిపోయాయి. కొత్త కుర్రాళ్లు కూడా బాగా చేసారు. అయితే ఫలితం ఏముంది. ఇక సంగీతం విషయానికి వస్తే… కాలభైరవ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కాలేదు. అది మరీ లౌడ్‌గా ఉంది, సాంగ్స్ కలిసి రాలేదు. ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది.

ఏదైమైనా…

గుణశేఖర్ ఒక సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక తల్లి తన కొడుకు తప్పును ఎండగట్టడం అనే పాయింట్ అద్భుతం. కానీ, కథను రెండు భాగాలుగా విడదీసి చెప్పాలనుకోవడంలో వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల.. ఒక గొప్ప క్లైమాక్స్ ఉన్నప్పటికీ, మధ్యలో సాగతీత వల్ల అది నీరుగారిపోయింది.

Similar Posts