
సుహాస్ ‘హే బలవంత్’ రివ్యూ
కృష్ణ (సుహాస్) చదువు పూర్తి చేసి పెద్ద బిజినెస్‌మ్యాన్ అవుదామని కలలు కనే సాధారణ కుర్రాడు. కారణం కూడా ఉంది.. అతని తండ్రి బల్వంత్ (నరేష్) పేరున్న బిజినెస్ మ్యాన్. ఇంట్లో ఆఫీస్ గురించి మాట్లాడిన ప్రతిసారి పెద్ద డీల్‌లు, మీటింగ్‌లు, సీక్రెట్ కాల్స్… ఇవన్నీ చూస్తూ పెరిగిన కృష్ణకి తన తండ్రి ఏదో పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం నడుపుతున్నాడనే ఫుల్ కాన్ఫిడెన్స్. బిజినెస్ అంటే స్ట్రాటజీలు, ఐడియాలు, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అంటూ పవర్‌పాయింట్ లెవెల్లో ఊహించేస్తుంటాడు.
అదే కాన్ఫిడెన్స్‌తో తాను కూడా బిజినెస్‌లోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. తన ప్లాన్లు, ఐడియాలు, ఫ్యూచర్ డ్రీమ్స్ చెబుతూ తిరుగుతుంటే చిత్ర (శివాని నాగారం)కి కూడా అతను నచ్చేస్తాడు. అమ్మాయికి కృష్ణలో కనిపించేది విజన్; ప్రేక్షకుడికి మాత్రం కనిపించేది ఓ చిన్న అమాయకపు ఓవర్ కాన్ఫిడెన్స్.
ఇంతలో బల్వంత్ అనారోగ్యం పాలవడంతో “ఇక నువ్వే చూసుకో” అని ఆఫీసు బాధ్యతలు కృష్ణ మీద పడతాయి. జీవితంలో మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగి లా కాదు… సీఈఓగా ఛార్జ్ తీసుకోబోతున్న ఓనర్ లా టై కట్టుకుని, పెద్ద కలలతో ఆఫీసుకి వెళ్లిన కృష్ణకి అక్కడ కనిపించిన అసలు వ్యాపారం మాత్రం అతని ఊహలకు పూర్తి విరుద్ధం. తండ్రి నడుపుతున్న బిజినెస్ ఏంటో తెలిసిన క్షణం అతను షాక్ అవుతాడు.
అప్పటివరకు తండ్రి గురించి చాలా గర్వంగా ఉన్న కృష్ణ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అవుతాడు. “ఇది ఎలా హ్యాండిల్ చేయాలి?” అన్న టెన్షన్ ఒక వైపు… చిత్రకి ఈ విషయం తెలియకుండా దాచాలనే భయం మరో వైపు. ఇంతకీ తండ్రి నడుపుతున్న బిజినెస్ ఏమిటి..ఎందుకు కృష్ణ షాక్ అయ్యాడు. ఆ బిజినెస్ గురించి చిత్రకు తెలుస్తుందా… అక్కడ నుంచి ఏమి జరుగుతుందనేది మిగతా కథ.
విశ్లేషణ
పెద్ద కార్పొరేట్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నానని అనుకుని ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెంచుకున్న కుర్రాడికి… “ఫ్యామిలీ బిజినెస్” అసలు అర్థం తెలిసిన తర్వాత జీవితమే ఎలా కామెడీగా, కొన్నిసార్లు డ్రామాగా మారిందన్న కథే ‘హే బలవంత్’. సినిమా మొత్తం హీరో ఒకే పని చేస్తుంటాడు — బిజినెస్ కంటే నిజాన్ని మేనేజ్ చేయడం!
దర్శకుడు గోపీ అచ్చర ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ చాలా బోల్డ్. సినిమాలో చాలా భాగం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది— “హీరో తండ్రి చేసే ఆ రహస్య వ్యాపారం ఏంటి?” ప్రేక్షకుడు కూడా అదే క్యూరియాసిటీతో థియేటర్లోకి అడుగుపెడతాడు. ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన కొడుకు, తన తండ్రి ఒక పెద్ద బిజినెస్ మెన్ అని నమ్ముతాడు. కానీ, ఆ సామ్రాజ్యం పునాదులు ఎక్కడ ఉన్నాయో తెలిసినప్పుడు కలిగే షాక్.. అదే ఈ సినిమా మెయిన్ హుక్. అక్కడదాకా సూపర్.
స్క్రీన్‌ప్లే భాషలో దీనిని సాధారణంగా “Dramatic Irony” అంటారు అంటే — ప్రేక్షకుడికి నిజం ముందే తెలుసు, కానీ కథలోని ప్రధాన పాత్రకు తెలియదు. ఆ గ్యాప్ నుంచే టెన్షన్, కామెడీ లేదా ఎమోషన్ పుడుతుంది. హీరో అమాయకంగా మాట్లాడుతుంటాడు, నిర్ణయాలు తీసుకుంటుంటాడు… మనం మాత్రం అతను ఎంత పెద్ద పొరపాటులో ఉన్నాడో తెలుసుకుని చూస్తుంటాం. అందుకే ప్రతి సీన్లో “ఇప్పుడు తెలిసిపోతుందేమో!” అనే ఆసక్తి పెరుగుతుంది. అక్కడే కామెడీ పండింది. హీరో ఇచ్చే బిల్డప్ డైలాగులు, వెన్నెల కిశోర్, సుదర్శన్ టైమింగ్ సినిమాను పరుగులు పెట్టించాయి. ఇంటర్వెల్ వరకు అంతా ‘కామెడీ వరల్డ్’లా సాఫీగా సాగిపోతుంది.
సెకండ్ హాఫ్: అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది!
సినిమా ఇంటర్వెల్ తర్వాత ఒక్కసారిగా గేర్ మారుస్తుంది. ఇప్పటి వరకు నవ్వించిన దర్శకుడు, సడన్‌గా మనల్ని ఎమోషన్ అయ్యిపోమంటాడు. క్లైమాక్స్ వచ్చేసరికి ఇది కేవలం కామెడీ సినిమా కాదు, ఒక ‘మోరల్ డ్రామా’గా మారిపోతుంది. మనం నవ్విన పాయింట్‌నే సీరియస్‌గా తీసుకోమంటే కాస్త అయోమయానికి గురవుతాం. తండ్రి పాత్రను ఎంత సమర్థించినా, లోపల ఎక్కడో ఒక చిన్న సందేహం మిగిలిపోతుంది.
నటీనటుల్లో …
సుహాస్ కృష్ణ పాత్రలో నేచురల్‌గా కనిపిస్తాడు. హీరోలా కాకుండా మన దగ్గర వాళ్లలో ఒకడిలా అనిపిస్తూ కామెడీ, ఎమోషన్ రెండింట్లోనూ మెప్పించాడు. శివాని నాగారం సాఫ్ట్‌గా నటించింది; “మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ” డైలాగ్‌తో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. నరేష్ పాత్ర బలంగా ఉంటుంది, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో మంచి ప్రభావం చూపించారు. సుదర్శన్ పంచులు సినిమాకు పెద్ద ప్లస్, వెన్నెల కిశోర్ కూడా కొన్ని చోట్ల నవ్వించాడు. అజయ్ ఘోష్, హర్షవర్ధన్, ప్రశాంతి, అన్నపూర్ణమ్మ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
టెక్నికల్ గా …
వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉషారుగా ఉంది, కానీ పాటలు పెద్దగా గుర్తుండవు. మహిరెడ్డి ఛాయాగ్రహణం బాగుంది, నిర్మాణ విలువలు సరిపడా ఉన్నాయి.
దర్శకుడు గోపి అచ్చరకు కామెడీపై మంచి పట్టు కనిపిస్తుంది. రిస్కీ కాన్సెప్ట్ తీసుకుని సస్పెన్స్, ట్విస్టులతో ఎంగేజ్ చేశాడు. కానీ అదే పాయింట్‌పై ఎమోషన్, మెసేజ్ కలపాలనుకోవడం మాత్రం పూర్తిగా పనిచేయలేదు — అక్కడే సినిమా కాస్త తడబడింది.
చూడాలా? వద్దా?
మీరు కేవలం సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. కానీ, ఒక లోతైన కథను, లాజిక్‌ను వెతికితే మాత్రం సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఓ సారి చూడచ్చు.
