ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.సంక్రాంతి కానుకగా రూపొంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా కలెక్షన్స్ లో మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోయినట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ వాస్తవానికి రెండో రోజు నుంచే కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అయ్యిపోయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చాలా ఏరియాల్లో తీసేసి ..వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీప్లేస్ చేస్తున్నట్లు సమాచారం. రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాత కాబట్టి ఇబ్బంది రావటం లేదు. అలాగే గేమ్ ఛేంజర్ సంక్రాంతికి ముందే వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు అంటోంది ట్రేడ్.
గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ స్టడీగా ఉంటే ఈ పరిస్దితి తలెత్తకపోను. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కలెక్షన్స్ బాగుండటంతో గేమ్ ఛేంజర్ ని తీసేయాల్సి వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ రేపటి నుంచి డబుల్ కానున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా రూ. 400 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేసారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమా రూ. 222 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 425 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్ ఈవెన్. అప్పుడే బాక్సాఫీస్ పరంగా హిట్ అయ్యినట్లు. అయితే ఇప్పుడున్న టాక్ తో అది ఏ మాత్రం రీచ్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయం.
సినిమా ఎలా ఉన్నా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ (Ram Charan) నటనపై అంతటా ప్రశంసలు వస్తున్నాయి. ‘‘అప్పన్న, రామ్ నందన్ పాత్రలకుగానూ చరణ్‌పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది. ఎస్.జె. సూర్య, కియారా అడ్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు.