సినిమా సమీక్షలు

రోషన్ ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ

1947 ఆగస్టు 15. దేశం స్వాతంత్య్రాన్ని సంబరంగా స్వాగతించిన రోజు. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం చరిత్ర కదలలేదు. నిజాం నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. రజాకార్ల అఘాయిత్యాలు తెలంగాణ పల్లెలను భయంతో నిశ్శబ్దంగా మార్చిన కాలమది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చే ధైర్యం మాత్రం బైరాన్‌పల్లిలాంటి కొన్ని ఊళ్లలోనే కనిపిస్తుంది. ఆయుధాలు తక్కువైనా, ఆత్మవిశ్వాసం ఎక్కువైన ఆ గ్రామాలు స్వాతంత్య్రం ఒక తేదీ కాదు, ఒక పోరాటం అని నిరూపించడానికి సిద్ధంగా నిలుస్తాయి.

అలాంటి చీకటి కాలంలోనే సికింద్రాబాద్‌ లో మైఖేల్ సి. విలియమ్స్ (మేకా రోషన్) అనే ఆంగ్లో ఇండియన్ యువకుడు ఉంటాడు. అతనికి దేశాలు, రాజకీయాలు కాదు… పట్టింపు లేదు. కేవలం ఫుట్‌బాల్ మాత్రమే లోకం. మైదానంలో చూపిన ప్రతిభ అతన్ని ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ దాకా తీసుకెళ్తుంది. కల నెరవేరే దశలో ఉన్న క్షణంలోనే అతని జీవితాన్ని గతం వెనక్కి లాగుతుంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా కుట్ర చేసారనే తండ్రి మీదున్న ఆరోపణలు మైఖేల్ భవిష్యత్తుని వెనక్కి లాగుతాయి. లీగల్ మార్గాలు మూసుకుపోతాయి. కల మిగిలిపోతుంది.

ఆ కల కోసం మైఖేల్ చీకటి దారిని ఎంచుకుంటాడు. ఇరవై రోజుల్లో ఇంగ్లాండ్ చేరాలనే ఆతృత అతన్ని అక్రమ ప్రపంచంలోకి నడిపిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన ఆయుధాలను హైదరాబాద్ నుంచి బీదర్‌కు తరలించే పని పెట్టుకుంటాడు. ఇది డబ్బు కోసం చేసిన ఒప్పందం మాత్రమే. అతని దృష్టిలో అది ఒక ట్రాన్సాక్షన్. కానీ విధి అతని జీవితాన్ని వేరే దిశలో రాస్తుంది.

దారి తప్పిన ప్రయాణం మైఖేల్‌ను బైరాన్‌పల్లికి తీసుకొస్తుంది. అక్కడ అతను చూసేది ఒక ఊరు కాదు. అది భయాన్ని దాటిన సమూహ మనస్తత్వం. రజాకార్ల అఘాయిత్యాలకు ఎదురు నిలబడుతున్న ప్రజలు. అయితే మొదటి నుంచీ పోరాటం అంటే ఇష్టం లేని మైఖేల్, ఆ పోరాటం తప్ప మరో దారి లేని మనుషుల మధ్య నిలబడతాడు. ఇక్కడే అతని అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది. కల కోసం పారిపోవాలా, లేక జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూడా నిశ్శబ్దంగా ఉండాలా అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది.

బైరాన్‌పల్లి ఉద్యమాన్ని అణచివేయడానికి ఖాసిం రజ్వీ రంగంలోకి దింపిన బాబు దేశ్‌ముఖ్ ప్రవేశంతో సంఘర్షణ తీవ్రత పెరుగుతుంది. మైఖేల్‌కు ఇది ఇక డబ్బు విషయం కాదు. ఇది అతని విలువల ప్రశ్న. రాజిరెడ్డి లాంటి పోరాట నాయకులు, చంద్రకళ లాంటి సున్నితమైన మనసులు, సుందరయ్య లాంటి ఆలోచనల బలం అతని ఆలోచనలను మార్చుతాయి.

యుద్ధం అంటే అసహ్యం అనుకున్న ఒక వ్యక్తి, యుద్ధం తప్పదని అర్థం చేసుకునే దశకు ఎలా వచ్చాడు? ఒక ఊరి పోరాటం, ఒక వ్యక్తి అంతరంగాన్ని ఎలా మార్చింది? కల కోసం మొదలైన ప్రయాణం, బాధ్యతగా ఎలా మారింది? వ్యక్తిగత ఆశయం నుంచి సామూహిక పోరాటం వరకూ సాగే ఈ మార్పే ‘ఛాంపియన్’ కథను ఎలా సినిమాటెక్‌గా నిలబెట్టింది…చివరకు ఏం జరిగిందనేదే మిగతా కథ.

విశ్లేషణ

తెలంగాణా సాయుధ పోరాటం చుట్టూ అల్లుకున్న ‘ఛాంపియన్’ సినిమాకు ఎంచుకున్న నేపథ్యం చాలా శక్తివంతమైనది. పోస్ట్ ఇండిపెండెన్స్ హైదరాబాద్, రజాకార్ల దౌర్జన్యం, తెలంగాణ పల్లెల పోరాటం – ఇవన్నీ సహజంగానే డ్రామా ఉన్న అంశాలు. ఈ స్థాయిలో కథకు కావాల్సిన రా మెటీరియల్ సినిమాలో పుష్కలంగా ఉంది. అయితే ఇన్ని ఎలిమెంట్స్ సినిమా అంత ఇంట్రస్ట్ గా అనిపించలేదు. అందుకు కారణం సమస్య ఎంచుకున్న నేపధ్యంలో కాదు ఆ కథను సినిమాటెక్ గా మార్చే విధానంలో ఉంది.

సినిమా ఓపెనింగ్‌లో చరిత్రను పరిచయం చేస్తుంది. కానీ ఆ చరిత్ర కథలోకి ప్రవహించదు . అది కేవలం బ్యాక్‌డ్రాప్‌గా మాత్రమే మిగిలిపోతుంది. అంటే…రజాకార్ల అఘాయిత్యాలు మనకు తెలుస్తాయి కానీ మనల్ని కదిలించవు. కారణం ఒకటే… కథలో సంఘటనలు జరుగుతున్నాయి, కానీ అవి హీరో జీవితాన్ని బలంగా తాకడం లేదు.

ఇక రోహన్ పాత్రకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది – ఇంగ్లాండ్ వెళ్లడం. అది మంచిదే. కానీ స్క్రిప్టులో అతను చేసే పనులకు, అతని అంతర్గత భావాలకు మధ్య సరైన ఘర్షణ లేదు.అతను ఆయుధాలు మోసుకెళ్తున్నాడు.అతను ప్రమాదంలో ఉన్నాడు. కానీ ఆ ప్రమాదం మనకి అనిపించదు. ఎందుకంటే… అతను ఓడితే ఏం కోల్పోతాడు? అతను గెలిస్తే ఏం పొందుతాడు? ఈ ప్రశ్నలకు స్క్రిప్టు స్పష్టమైన భావోద్వేగ సమాధానం ఇవ్వదు.

దాంతో సినిమా ఫస్టాఫ్ బాగా ఫ్లాట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో సీన్లు ఉన్నాయి, కానీ సీన్ టెన్షన్ లేదు. హీరో–హీరోయిన్ సన్నివేశాలు కథను ముందుకు నడపాల్సినవి. కానీ అవి కేవలం మధ్యలో పెట్టిన సీన్లలా అనిపిస్తాయి. నాటకాల సన్నివేశాలు ఐడియాగా బాగున్నా, అవి కథలోకి లీనమవ్వవు. ఫలితంగా ఫస్ట్ హాఫ్ అంతా ఒకే మూడ్‌లో నడుస్తుంది. ఇంటర్వల్ కూడా కథను కొత్త దిశలో తిప్పదు. అది ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచకుండా, నిరీక్షణను తగ్గిస్తుంది.

సెకండాఫ్ లోను అదే పరిస్దితి. అక్కడ కథలో తీవ్రత పెరగాలి. హీరో నిర్ణయాలు డైనమిక్ గా మారాలి. ప్రతి అడుగు ఒక రిస్క్ కావాలి. కానీ ఇక్కడ కూడా సంఘర్షణలు ఉపరితలంగానే ఉంటాయి. కొన్ని సీన్లు బాగానే ఉన్నా, అవి కలిసిపోవు. క్లైమాక్స్‌లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు. కానీ ఆ మెసేజ్ డ్రామా నుంచి పుట్టదు , పై నుంచి పడినట్టుగా ఉంటుంది.

టెక్నికల్‌గా బాగుందా?

విజువల్స్ బాగున్నాయి. కాలాన్ని రీక్రియేట్ చేశారు. సినిమా చూడటానికి పాలిష్డ్‌గా ఉంది. కానీ స్క్రిప్టు బలంగా లేకపోతే, ఆ అందం లోపలి ఖాళీని దాచలేకపోతుంది.అలాగే ఆర్టిస్ట్ లు అంతా బాగానే చేసారు. అయితే శ్రీకాంత్ కొడుకు రోషన్ వయస్సు ఈ పాత్రకు సరిపోదేమో అనిపించింది.

ఫైనల్ గా ..

ఈ సినిమాకు పెద్ద సమస్య – కాన్విక్షన్ లేకపోవడం. కథను చెప్పాలనుకున్నారు, కానీ దాన్ని నమ్మి చెప్పలేదు. పాత్రలు మాట్లాడుతున్నాయి, కానీ మనతో మాట్లాడట్లేదు. సంఘర్షణలు ఉన్నాయి, కానీ మనలో ఒత్తిడి సృష్టించలేకపోయాయి.

Similar Posts