
మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్)కి పదవి కంటే పెద్దది పరువు. రాజకీయాల ప్రపంచంలో “ఇమేజ్” అంటే ఆయనకి ప్రాణం. ఆ ఇమేజ్‌కి ఒక్క గీత పడినా… ఆయన దానిని రక్తంతో తుడుస్తాడు. తల్లి లేకుండా పెరిగిన తన కూతురు కుందన (మమితా బైజూ) ఆయనకు ప్రాణం.
ఆత్మహత్య చేసుకున్న చెల్లెలి జ్ఞాపకంగా కూతురికి ఆ పేరే పెట్టాడు — కుందన. ఆ పేరులో ఆయన ప్రేమ ఉంది… దుఃఖం ఉంది… గౌరవం ఉంది. కానీ అదే ఆమెతోనే ఒకరోజు ఆయన రాజకీయ పరువు తూలిపోతుందని ఆయన ఊహించలేదు.
ఆదికేశవులుకి ఒక చెల్లెలు ఉంది — రోహిణి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ, ఒకప్పుడు పక్కపక్క ఇళ్ళలో ఉండిన వాళ్లు, ఇప్పుడు చూపులు కలవని పరాయి వారు. ఆమె కొడుకు గగన్ (ప్రదీప్ రంగనాథ్) — ఒక సైలెంట్ స్టోర్మ్.
ప్రేమలో మోసపోయిన వాడు. అముద (నేహా శెట్టి) అనే అమ్మాయిని ప్రాణం పెట్టి ప్రేమించాడు, కానీ ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుంది.
ఎందుకు వెళ్లిపోయిందో ఈరోజు వరకూ అతనికి అర్థం కాలేదు — అయితే ఆ ఖాళీని నింపబోయేది… కుందనే.
కుందనకి గగన్ మీద పిచ్చి ప్రేమ. అతనినే తన జీవిత భాగస్వామిగా ఊహిస్తుంది. కానీ గగన్ మాత్రం దూరంగా ఉంటాడు.నో చెప్పేస్తాడు. కానీ ఒకరోజు గగన్‌కి అర్థమవుతుంది — తన హృదయం కుందన వైపే పరుగెడుతోందని. అతను వెళ్ళి తన మనసులో మాట చెప్పేలోపే,
కుందన చెబుతుంది — “నేను పార్థుని ప్రేమిస్తున్నా.”
ఇదే విన్నాడు ఆదికేశవులు. తన కులానికి చెందని వాడితో కూతురి పేరు కలుస్తుందని తెలిసి మండిపోతాడు. “మా ఇంట్లో ప్రేమ కంటే పరువు పెద్దది!” అని తేల్చి చెబుతాడు. గగన్‌తోనే పెళ్లి జరగాలంటాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ — గగన్ అదే ప్రేమను రక్షించడానికి పూనుకుంటాడు, ఈ క్రమంలో ఏం జరుగుతుంది. చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
ఎనాలసిస్
దర్శకుడు కీర్తీశ్వరన్ ఎంచుకున్న పాయింట్ చాలా బోల్డ్. కులాంతర వివాహాలు, పరువు హత్యలు, ప్రేమ — ఇవన్నీ మన సమాజం ఇప్పటికీ పూర్తిగా విడిచి పెట్టని మంటలు. అయితే ఈ విషయాలను యూత్‌ఫుల్ టోన్‌లో చూపిస్తూ ఆయన “డ్యూడ్” అనే సినిమాను రాసుకొన్న తీరు కొంచెం ఇబ్బందిపెట్టిందనే చెప్పాలి.
ఫస్ట్ హాఫ్‌లో సినిమా టెంపోని బాగానే మెయింటైన్ చేశాడు. సామాజిక పాయింట్‌లతో పాటు యూత్ టచ్ ఇచ్చి, రొమాన్స్, సబ్టిల్ హ్యూమర్, డ్రామా అన్నీ కలిపాడు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి న్యారేషన్ గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఎటు వెళ్లాలో తానే మర్చిపోయినట్లు అనిపిస్తుంది. కుల విభేదాలు, కుటుంబ కాంక్షలు, ప్రేమ త్యాగాలు — ఇవన్నీ ఒకేసారి పేలడంతో ప్రేక్షకుడు ఎక్కడ ఎమోషన్ పీక్‌లో ఉన్నాడో గ్రహించలేడు.
సినిమా చివరికి దర్శకుడుకి ఒక పెద్ద ప్రశ్న వదిలేస్తుంది —
“ఈ కథను చెప్పడమా లక్ష్యమా? లేక ఎంటర్‌టైన్ చేయడమే ప్రధానమా?”
దాంతో చాలా చోట్ల “ఇది ముందే చూశాం” అనే ఫీలింగ్ తప్పించలేము. ఇది కొత్త కథ కాదు — పాత పాయింట్లను మిక్స్ చేసి కొత్తగా ప్యాక్ చేసిన సినిమా. ఎక్కడో “పరువు” లోని శక్తి ఉందనిపిస్తుంది కానీ, ఆ శక్తిని ఫోకస్ చేయకుండా, సబ్ ప్లాట్స్ లో దాన్ని చెదరగొట్టాడు దర్శకుడు.
“డ్యూడ్” పాయింట్‌ను ఎమోషన్‌తో కాకుండా ఎక్స్‌పెరిమెంట్‌లతో చెప్పాలనే ప్రయత్నం ఈ సినిమాకి మైనస్ అయింది. సినిమాటిక్ ఇంపాక్ట్ మిస్సయింది.
Performances:
ఈ సినిమా ప్రాణం — ప్రదీప్ రంగనాథన్. ఆయన నటనే “డ్యూడ్”ని లిఫ్ట్ చేసింది. గగన్ పాత్రలో ఆయన చూపిన భిన్న భావాలు – ప్రేమ, కోపం, గిల్ట్, త్యాగం అన్నీ సజావుగా మిళితమై కనిపిస్తాయి. స్క్రీన్‌పై ప్రతి సీన్‌లో ఆయన మాగ్నెటిజం ఉంటుంది.
మమితా బైజు ని మాత్రం కాస్త తగ్గించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మాత్రమే ఆమె ప్రెజెన్స్ ఫీల్ అయ్యింది కానీ, పూర్తి పాత్రకు న్యాయం చేయలేకపోయింది. శరత్ కుమార్ — సెట్ ఫార్మాట్ విలన్ పాత్రలోనే ఉన్నాడు; ఎలాంటి సర్ప్రైజ్ లేదు. నేహా శెట్టి – సత్య జంట మాత్రం పూర్తిగా టోన్-మిస్.
టెక్నికల్ పరంగా..
మ్యూజిక్: తెలుగు నేటివిటీకి ఏమాత్రం సరిపోని ట్యూన్స్. సాయి అభయంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా భావోద్వేగాలను రేకెత్తించడంలో విఫలమైంది. సన్నివేశాల తీవ్రతకు తగ్గ సంగీతం లేకపోవడంతో, ఎమోషన్ ఫ్లాట్‌గా మారింది.
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి సాధారణంగా మంచి సినిమాటోగ్రాఫర్ అయినా, ఈ సినిమాలో ఆయన లెన్స్ వర్క్ డల్‌గా అనిపిస్తుంది.
ఆర్ట్ & డిజైన్: ఆర్ట్ వర్క్, సెట్స్ అన్నీ సోమరిగా తయారైనట్టు. మూడ్‌కు తగిన టెక్స్చర్ లేకపోవడం వల్ల సినిమాకి రియలిజం తగ్గింది.
ప్రొడక్షన్ వాల్యూస్: సాధారణంగా మైత్రీ మూవీ మేకర్స్ అంటే హై స్టాండర్డ్, రిచ్ లుక్. కానీ “డ్యూడ్” లో ఆ మెరుపు కనిపించలేదు. తక్కువ బడ్జెట్ లుక్, పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల “ఇది నిజంగా మైత్రీ సినిమా?” అనే సందేహం కలిగిస్తుంది.
ఫైనల్ గా..
“డ్యూడ్” – ఆలోచన ఉన్న సినిమా, ఆత్మ లేని ఎగ్జిక్యూషన్.
ప్రేమకు, పరువుకు మధ్య దారి చూపాలని మొదలైన కథ… చివరికి తానే దారి తప్పింది.
